జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేకుంటే తాను మంత్రిని అయ్యేవాడినే కాదనని ఏపీ సమాచార శాఖామంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ లేకుంటే తాను మంత్రిని అయ్యేవాడినే కాదని, తనను మంత్రిగా నిలబెట్టడానికి ప్రధాన కారకులు ఆయనేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతమైన వ్యక్తి అని, ఆయన బృందంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆదివారం
ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లమనడంతో అక్కడికి వెళ్లలా? వద్దా? అని సంశయించానన్నారు. అదేసమయంలో ఇక్కడి సామాజికవర్గ సోదరులు, మిత్రులు తామంతా అక్కడికి వచ్చి సపోర్టు చేస్తామంటూ ఎంతో ప్రోత్సహించారన్నారు. ఎన్నికల్లో ఎంతవరకు సఫలీకృతుడిని అవుతానో తెలియడం లేదని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద అన్నప్పుడు ధైర్యంగా వెళ్లండి గెలుస్తారని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.
గెలిచిన తర్వాత మంత్రివర్గంలో పెట్టే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ భరోసా ఇచ్చారని మంత్రి గుర్తు చేసుకున్నారు. తనకు పట్టం కట్టిన నిడదవోలు ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని, ఏ పదవిలో ఉన్నా వారికి సేవకుడిగానే ఉంటానని ఆయన అన్నారు. కాపు సంక్షేమ సేవా సంఘం సేవా కార్యక్రమాల్లో ముందడుగు వేస్తుండటం అభినందనీయమన్నారు. సామాజిక వర్గాలకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని మంత్రి అన్నారు.