బాధ్యతల నిర్వహణలో పూర్తి సంతృప్తి... సీఎస్ దినేష్ కుమార్
అమరావతి: ఐఏఎస్ అధికారిగా తన 35 ఏళ్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ చెప్పారు. ఈ నెల 30న ఆయన పదవీ విరమణను పురస్కరించుకొని సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో సచివాలయం 1వ బ్లాక్ గ్రీవెన్స్
అమరావతి: ఐఏఎస్ అధికారిగా తన 35 ఏళ్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ చెప్పారు. ఈ నెల 30న ఆయన పదవీ విరమణను పురస్కరించుకొని సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో సచివాలయం 1వ బ్లాక్ గ్రీవెన్స్ హాల్‌లో శుక్రవారం సాయంత్రం విడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తనను శాలువాలతో సన్మానించి, పూల గుచ్ఛాలతో సత్కరించినవారికి సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా తన 35 ఏళ్ల ఉద్యోగ నిర్వహణలో 3 ఏళ్లు మాత్రం కేంద్ర సర్వీసులకు వెళ్లినట్లు తెలిపారు. ఆ కాలం అంత సౌకర్యంగా లేదని చెప్పారు.
బాధ్యతల నిర్వహణలో ఒడిదుడుకులు సహజమన్నారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రంగా అభివర్ణించారు. యువ ఐఏఎస్ అధికారులు ఉన్నారన్నారు. దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంతో పోల్చుకుంటే రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులు రెట్టింపు అయినట్లు చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు. తప్పుఒప్పులు ఆయన స్పష్టంగా చెబుతారని చెప్పారు. ఆయన వద్ద చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. 1983లో ఆయన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించి 35 ఏళ్లు వివిధ శాఖలలో పని చేసినట్లు తెలిపారు. తొలుత పార్వతీపురంలో సబ్ కలెక్టర్‌గా, ఆ తరువాత అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాలకు కలెక్టర్‌గా, ఆర్థిక, రెవెన్యూ శాఖలలో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా కూడా పని చేసినట్లు వివరించారు.
2017 ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో 8 నెలలు మాత్రమే పని చేసే అవకాశం లభించినట్లు తెలిపారు. ఆయన చాలా మంచి మనిషని కొనియాడారు. తనకు వ్యక్తిగతంగా కూడా సహాయపడినట్లు తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఆయన ఆధ్వర్యంలో 2 నెలలు మాత్రమే పనిచేసే అవకాశం లభించినట్లు తెలిపారు. ఈ కొద్ది కాలంలోనే ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు.
నిబద్ధత గల అధికారిగా ఆయనను కొనియాడారు. ఆయన ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తున్నారని, రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అన్నారు. సభను నిర్వహించిన ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ దినేష్ కుమార్ చివరిరోజు వరకు నిజాయితీగా పనిచేశారని కొనియాడారు. రెండేళ్లు మాత్రమే ఆయనతో కలసి పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఎవరితోనైనా నిర్భయంగా, నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన వద్దే నేర్చుకున్నానని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీ కృష్ణ మాట్లాడుతూ సీఎస్ దినేష్ కుమార్ నిబంధనలకు అనుకూలంగా ఉంటే ఏ పనైనా వెంటనే చేసేవారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్స్ విషయంలో రాష్ట్రానికి లాభం చేకూరేవిధంగా కృషి చేశారని చెప్పారు. ఆయన సీఎస్‌గా ఉన్న సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.7,500 కోట్ల నిధులు అదనంగా వచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా అదనంగా రాబట్టినట్లు చెప్పారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్నారు. సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం క్యాంటిన్ అధ్యక్షులు వంకాయల శ్రీనివాస్ సీఎస్ దినేష్ కుమార్‌కు పూల గుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మన్మోహన్ సింగ్, పూనమ్ మాలకొండయ్య, సాధారణ పరిపాలనా, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.