Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగా పడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌: జగన్

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (20:59 IST)
రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయామని, దగా పడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయిందని, అయినా వెనుకడుగు వేయకుండా అభివృద్ధి దిశలో పయనిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలనతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాల అవసరాలు తీర్చడంతో పాటు, వారి తర్వాతి తరం వారు కూడా సగర్వంగా తిరిగేలా, అన్ని వర్గాల సంక్షేమం కోసం నవరత్నాలు పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఇప్పుడు అందరం కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అయిదేళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించిన అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం పాల్గొన్నారు.

గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు, ఈ వేడుకను నిర్వహించలేదు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 

గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి ఈ వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌.. తొలుత ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించి, ఆ తర్వాత పలువురు తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల వారసులను సత్కరించారు. 

వారు మన గుండెల్లో నిల్చి ఉంటారని, ఈ రోజు తెలుగుతల్లి, తెలుగు నేత, తెలుగు వారందరికీ వందనాలు పలుకుతూ 5 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని జగన్‌ చెప్పారు. నాడు స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు త్యాగం చేశారని, వారి వారసులను ఇక్కడ సన్మానిస్తున్నామని, ఈ సందర్భంగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నానని అన్నారు.

తెలుగు రాష్ట్రం కోసం 1952లో 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు అమరులయ్యారని, ఆయన త్యాగాలు ఇప్పటికీ  స్మరించుకుంటున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహానుభావులకు మన గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. 

చెప్పిన మాట ప్రకారం
చెప్పిన మాట ప్రకారం నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 5 ఏళ్ల తర్వాత ఘనంగా నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య వంటి ఎందరో మహానుభావులు, సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు, పాత్రికేయుల భావాలు మనకు ఆదర్శమని ఆయన తెలిపారు. 

దగా పడిన రాష్ట్రంగా మిగిలాం
ఇవాళ మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌ పేరుతో వేరుగా ప్రయాణం చేస్తున్నామని సీఎం, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ, వాటి ఫలితాలు హైదరాబాద్‌లో మిగిలిపోయాయని పేర్కొన్నారు.

1956లో విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత మహానేత వైయస్సార్‌ జీవించి ఉన్నంత వరకు.. అంటే 2009 సెప్టెంబరు 2 వరకు మనమంతా ఊహించని పరిణామాలు చూడలేదని గుర్తు చేశారు.

ఏ రాష్ట్రం కూడా దగా పడని విధంగా మనం ఉండిపోయాం. అయినా అధైర్య పడలేదు. వెనుకడుగు వేయకుండా అభివృద్ధి దిశలో పయనిస్తున్నాం. గత 10 ఏళ్లుగా వెనకబడిన వాటిని అధిగమిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
అందుకే నవరత్నాలు
‘ఒక పేద కుటుంబం కానీ, రైతు కుటుంబం కానీ, దిగువ.. మధ్య తరగతి కుటుంబం కానీ.. వారి అవసరాలు తీర్చడంతో పాటు, వారి తర్వాతి తరం వారు కూడా సగర్వంగా తిరిగేలా నవరత్నాలు పథకాలు అమలు చేస్తున్నాం.

వెనకబాటుతనం, నిరక్షరాస్యతను నిర్మూలిస్తేనే ముందుకెళ్తాం. అందుకే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా నవరత్నాలు పథకాలు. పాలనలో నవరత్నాలతో ముందుకెళ్తున్నాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
కలిసికట్టుగా పని చేస్తే..
ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరుపుకుంటున్నామన్న సీఎం వైయస్‌ జగన్, ఇందులో అందరం మర్చిపోకూడని ఒక అంశం ఉందని చెప్పారు. ‘ఇది ఎందరో గొప్ప వ్యక్తుల త్యాగఫలం. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి.

ఇప్పుడు అంతా కలిసి ఉంటే, కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలుగుతాము’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అందరి చల్లని దీవెనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.
 
అదృష్టంగా భావిస్తున్నాను: గవర్నర్‌
రాష్ట్రానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, పల్లవులు, చాళుక్యులు వంటి గొప్ప తరాల రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని, స్వాతంత్య్ర పోరాటంలో కూడా ఇక్కడ ఎందరో మహానుభావులు పాల్గన్నారని గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఈ సందర్భంగా చీరాల–పేరాల ఉద్యమాన్ని ప్రస్తావించిన ఆయన, అది ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.

విజయవాడ నగరాన్ని నాడు మహాత్ముడు ఆరుసార్లు సందర్శించారని గుర్తు చేశారు. అంతటి ఘనచరిత్ర ఈ ప్రాంతానిదని కొనియాడారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన మన్యం విప్లవం కూడా చాలా గొప్పదని చెప్పారు. ఇలాంటి రాష్ట్రానికి గవర్నర్‌గా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.


పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష తర్వాత ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడిందని, ఆ తర్వాత భాషా ప్రయుక్త తొలి రాష్ట్రంగా విశాల ఆంధ్రప్రదేశ్‌ అవతరించిందని, భారత జాతీయ పతాకాన్ని కూడా రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య రూపొందించారని గవర్నర్‌ గుర్తు చేశారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన అభినందించారు. అనంతరం కార్యక్రమంలో సురభి నాటక సమాజం కళాకారులు కొన్ని ఘట్టాలను ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments