ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినిమా టిక్కెట్లపై చర్చ చేసిన మరుసటి రోజే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. కట్టప్పను చంపింది ఎవరు అంటూ...సెటైర్ వేశారు. అయితే, ఈ ట్వీట్ ఆయన టిక్కెట్ల ధరల తగ్గింపు అంశాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు చేశారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఆయన తాను పరిశ్రమ ప్రతినిధిగా రాలేదని అంటూనే, మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపి, హైదరాబాదుకు తిరుగుపయనం అయ్యారు. తిరిగి వేరే రాష్ట్రంలో ఆర్.ఆర్.ఆర్.కి టిక్కెట్ భారీగా పెంచి అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించారంటూ ట్వీట్ చేశారు. అంటే, ఈ సినిమా టిక్కట్ల వ్యవహారాన్ని పరిశ్రమ పెద్దలకు కాక తగిలేవరకు లైవ్ లో ఉంచడం వర్మ టెక్నిక్ గా భావిస్తున్నారు.
సినిమా టికెట్ల విషయంలో నిన్న రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయిన వర్మ, నేడు ఇలా ట్వీట్ చేశారు. టికెట్ల ధరల గురించి ప్రశ్నించే వారికి కోసం అంటూ ఈ సెటైర్ వేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఐనాక్స్ ఇన్‌సిగ్నియా మల్టిప్లెక్స్ సినిమా టికెట్‌ను రూ.2,200లకు అమ్ముతోంది. రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టికెట్‌ను రూ. 2200లకు అమ్మేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం రూ. 200లకు అమ్మడానికి కూడా అనుమతించడం లేదు. దీంతో అసలు కట్టప్పను చంపిందెవరు? అని ట్వీట్ చేశారు. అంటే పరిశ్రమను చంపుతోంది ఎవరు అని ఆర్జీవీ ప్రశ్నను సంధించారు.