కరోనా రోగులకు ఇవ్వాల్సిన రెమ్‌డెసివిర్ సూదిమందు నల్లబజారులో విక్రయించిన ముఠాను అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సీఐ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు, ముగ్గురు జిల్లా సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారు.
వీరి నుంచి 14 రెమ్‌డెసివిర్ సూది మందును, రూ.94 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు సుకన్య, భారతి, సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు రాజేష్, నరేంద్ర, కిశోర్‌నాయుడుతో పాటు విశ్వనాథరెడ్డి (రామచంద్రనగర్), సత్యనారాయణ (మాలవాండ్లపల్లి, నార్పల) ఉన్నారు.
నేపథ్యం ఇదీ..
సర్వజన ఆసుపత్రిలో పొరుగు సేవల ఉద్యోగుల రాజేష్, నరేంద్ర, కిశోర్‌నాయుడుతోపాటు ప్రైవేటు మెడికల్ మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నారు. వీరందరూ కలిసి రెమ్‌డెసివిర్ అక్రమ వ్యాపారానికి తెరలేపారు. సర్వజన ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్లు వాడుతున్నారు. ఈక్రమంలో వాటిని దారి మళ్లిస్తున్నారు. సగం ఇంజక్షన్లు రోగులకు ఎక్కించి మిగిలిన మందును నర్సులు ఈ ముఠా సభ్యులకు విక్రయించారు. ఒక్కో సూది మందు రూ.16 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు.