Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓదార్పు యాత్ర' పేరుతో దశాబ్ద కాలం పాటు యాత్రలు చేయొచ్చు.. : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (07:40 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో విపక్ష నేతలు రోడ్‌‍షోలు, ర్యాలీలు చేయకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై ఆయన మండిపడ్డారు. ఓదార్పు యాత్ర పేరుతో దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్‍ షోలు చేయొచ్చు కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగొద్దా అని ప్రశ్నించారు. 
 
ప్రతిపక్షాల్లో ప్రజల్లో తిరగడానికి అనుతించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మీరు అధికారంలో లేనపుడు ఒక రూలు, అధికారంలోకి వచ్చాక మరో రూలా? అని నిలదీశారు. మరోవైపు పింఛన్లను తొలగించడాన్ని కూడా ఆయన ఖండించారు. ఇదే అంశంపై ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. 
 
సామాజిక పింఛన్ల తొలగింపుపై... 
రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉంది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేశారు. పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటి వరకూ పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
 
లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. మచ్చుకు కొన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి - ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని కారణం చూపారు. అదే నిజమైతే ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 
 
అదేవిధంగా పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన శ్రీమతి రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్ళు ఉన్నాయని నోటీసులో చూపారు. నిజంగా అన్ని ఇళ్ళు రామక్క గారికి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఆ ఇళ్ల తాళాలు ఇవ్వండి. మెళియాపుట్టి ప్రాంత వృద్ధులైనా, రజక వృత్తి చేసుకొనే రామక్క గారైనా పేదలే. వారికి తండ్రి నుంచో, తాతల నుంచో వారసత్వంగా వచ్చిన ఎస్టేట్లు, ఇళ్ళు లేవని గ్రహించగలరు. 
 
మీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అంతటి ఆస్తిపరులే అయితే పింఛన్లు కోసం కార్యాలయాల చుట్టూనో, మీ వాలంటీర్ల చుట్టూనో ఎందుకు తిరుగుతారు? విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉంది. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటున్నాయి... అలాగే ఒకే ఇంటి నెంబర్ తో మూడు నాలుగు వాటాలు ఉంటాయి. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులను, వితంతువులను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
 
ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారు. పాతికేళ్ళ కిందట చనిపోయినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారు అని నోటీసుల్లో చూపించి వితంతు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ తరహా నోటీసులు సమర్ధనీయమేనా? ఈ తరహా నోటీసులు దివ్యాంగులకు సైతం వేదన కలిగిస్తున్నాయి. పదిపదిహేనేళ్ళకు ముందు నుంచీ పింఛన్ తీసుకొంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన ధ్రువపత్రాలు ఇప్పుడు చూపించాలని ఒత్తిడి చేయడంలో ఉద్దేశం ఏమిటి? వారి వైకల్యం కళ్లెదురుగా కనిపిస్తున్నా లబ్ధికి దూరం చేస్తామనడం భావ్యమేనా?
 
మా పార్టీ తరఫున చేపట్టిన 'జనవాణి' కార్యక్రమంలో అనేకమంది దివ్యాంగులు - తమకు పింఛన్లు అందటం లేదని, పింఛన్లు రాకుండా రాజకీయ కారణాలతో అడ్డుకొంటున్నారనీ, వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికెట్లు మంజూరు ఇబ్బందికరంగా మారిందనీ వాపోయారు. పింఛన్ల రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితులను తెలియచేస్తుంటే సరిదిద్దకపోగా.. 'తిట్టండి' అని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించాననే భావిస్తున్నారా?
 
అవ్వా..! . తాతా... అంటూ, రూ.3 వేలు పెన్షన్ ఇస్తాను అని మీరు ఇచ్చిన హామీని ఈ విధంగా అమలు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలి. అంతేగానీ పెన్షన్ మొత్తం పెంచుతున్నాం కాబట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలి అనుకోవడం సరికాదు. మీ పాలనలోని ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడం ఏమిటి? సామాజిక పింఛన్ అందుకొంటున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నాను. పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను.
జైహింద్
ఇట్లు
పవన్ కళ్యాణ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments