Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ 100 శాతం ముఖ్యమంత్రి అభ్యర్థి: నాదెండ్ల మనోహర్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (08:48 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి విజయం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే వారం రోడ్ షో నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రోడ్ షో తరవాత బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులంతా బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. 
 
“ప్రజాస్వామ్యంలో ఒక మార్పు కోసం.. ప్రజల కోసం ఈ ర్యాలీ చేస్తున్నాం. ఒక మంచి అభ్యర్ధిని ఎన్నుకోవాలని కోరుతూ ఈ ర్యాలీ చేస్తున్నాం. భవిష్యత్తులో జనసేన-బీజేపీ ఏ విధంగా కలసి పనిచేయబోతున్నాయో చెప్పేందుకు ర్యాలీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక కవాతు మాదిరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. తిరుపతి పట్టణంలోని జనసైనికులంతా సమష్టిగా పని చేయాలి. 
 
పవన్ కళ్యాణ్ 100 శాతం ముఖ్యమంత్రి అభ్యర్థి. జాతీయ పార్టీ బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులే ఆ మాటన్నారు.  సోము వీర్రాజు మాటలను అభినందిస్తూ స్వాగతిస్తున్నాం. పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం. నిజాయతీగా ప్రజల కోసం ఒక అంకిత భావంతో పని చేసే అలాంటి వ్యక్తి అవసరం. ఒక ప్రణాళికతో మార్పు కోసం ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ దిశగా ప్రజల్లో మార్పు తీసుకువచ్చే విధంగా మీరంతా కష్టపడాలి. అందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే సరిపోదు.

మీరంతా బయటకు రావాలి. ప్రతి గడపా తొక్కాలి. ఇంటింటికీ వెళ్లి జనసేనకు ఎందుకు ఓటెయ్యాలో చెప్పాలి. ఈ సందర్భంగా బీజేపీతో ఎందుకు కలసి పని చేస్తున్నామన్న విషయాన్ని వివరించాలి. పొత్తులో భాగంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ విజయం కోసం సహకరించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది.

భారతీయ జనతా పార్టీతో పొత్తు, సీటు కేటాయింపు వ్యవహారంలో మీరంతా ఇబ్బందిపడ్డారు. ఆవేదన వ్యక్తపరిచారు. అయితే ఈ నిర్ణయం వెనుక రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. రాజకీయ పార్టీగా ఇప్పుడిప్పుడే అడుగులు వేసుకుంటూ ఎదుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

ప్రత్యేకంగా ఆలయాలు, గుడులపై చేస్తున్న దౌర్జన్యాల వ్యవహారాన్ని తిప్పికొట్టాలి. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక మనందరికీ ఒక పరీక్ష లాంటిది. భారతీయ జనతా పార్టీతో మనకున్న పొత్తుని అంతా గౌరవించండి. రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు ఈ కలయిక ద్వారా వస్తుంది.

మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధిష్టానానికి పదేపదే చెబుతూ వచ్చారు. అందుకు వారు కొంత సమయం తీసుకున్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభని ఎంపిక చేశారు. ఆవిడ ఉన్నతమైన చదువులు చదివారు. సమాజానికి ఎంతో సేవ చేశారు. రత్నప్రభ గెలిస్తే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది.
 
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
ఇక్కడ ప్రస్తావనార్హమైన మరో అంశం- స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు ఎదురు నిలిచింది జనసేన పార్టీయే. ముఖ్యమంత్రి ప్రకటించుకున్నట్టు 96 శాతం ప్రజలు వైసీపీకి మద్దతు పలుకుతున్నది వాస్తవం అయితే, ఆ నమ్మకం, దమ్ము వారిలో ఉంటే రీ నోటిఫికేషన్ ఇవ్వాలి.

ఎంత మంది జనసేన నాయకులు గెలుస్తారో నిరూపిస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో జనసేన పార్టీ నాయకులు కనిపించేలాగా చేస్తాం. ఎప్పుడో 14 నెలల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ చూపి ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితులను
 
మీరంతా ఖండించాలి. అందుకే జనసేన పార్టీ తరఫున కోర్టుకు వెళ్లాం. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ది ఉంటే రీ నోటిఫికేషన్ ఇవ్వండి. ప్రజల్లో ధైర్యాన్ని నిలబెట్టే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, స్వేచ్ఛగా పోలీసు యంత్రాంగాన్ని, వాలంటీర్ల ఉపయోగించుకుండా ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలం ఏంటో చూపగలుగుతాం.
 
పదిమంది జనసైనికులు వెయ్యిమందితో సమానం 
మనమంతా నిజాయితీగా నిలబడిన వ్యక్తులం. మనం స్వార్థం కోసం రాజకీయాలు చేయడం లేదు. కానీ మనకు పదవి అవసరం. మనకి ఒక వ్యూహం ఉండాలి. పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు ఎంతో కష్టపడ్డారు. అన్ని సామాజిక వర్గాల నుంచి మహిళలను తీసుకువచ్చి, వారిని ప్రోత్సహించి పోటీ చేయించారు. వారి కోసం దెబ్బలు తిన్నారు. చివరికి విజయోత్సవ ర్యాలీల్లో కూడా దెబ్బలు తిన్న వ్యక్తులు మన జనసైనికులు.

పది మంది జనసైనికులు వెయ్యి మందితో సమానం. రాష్ట్రంలో మొన్న పంచాయితీ ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, రేషన్ కార్డులు తీసేస్తాం, ఇళ్ల పట్టాలు తీసేస్తాం, ఫించన్లు తీసేస్తాం అంటూ బెదిరించారు. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి ఓట్లు లెక్కపెడతాం అని బెదిరించిన సందర్భాల్లోనూ పార్టీకి  ధైర్యంగా అండగా నిలబడింది వీర మహిళలే. 
 
అప్పుల్లో ఉన్న వృద్ధి సంక్షేమంలో లేదు
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఇప్పుడు దేశంలోనే ఉన్నత స్థాయికి చేరింది. రోజుకీ రూ.500 కోట్ల అప్పు చేస్తున్నారు. మరి సంక్షేమం ఎంత మందికి చేరింది? మీరు చేస్తున్న అప్పులకు నూటికి నూరు శాతం సంక్షేమం  కోసం, ప్రజల కోసం అందిస్తున్నారా? గత ఏడాదితో పోలిస్తే అప్పులు 54 శాతం పెంచారు.

మరి గత ఏడాదితో పోలిస్తే  సంక్షేమం ఎంత పెంచారు? ఇసుకలో సంపాదించే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మద్యంలో సంపాదించిన డబ్బు, సిమెంట్ ఫ్యాక్టరీలలో సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతోంది? ఒక్కో ఎమ్మెల్యే భూముల్లో స్కాములు చేసి ఎంత సంపాదించాడో  అందరికీ తెలుసు. 
 
ఇసుక అక్రమ సంపద సింగిల్ విండోలో ఒక చోటికే చేరుతుంది 
ప్రస్తుత పాలకులు ప్రభుత్వంలో ఉండి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సినవి కూడా ఉండడం లేదు. గతంలో వెయ్యి రూపాయలకు ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఈ రోజు ఏమైపోయింది. ఇసుక సమృద్ధిగా దొరికే చిత్తూరు లాంటి జిల్లాలో సైతం ట్రాక్టర్ ఆరు వేల రూపాయలు చేశారు.

ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది. మాట్లాడితే అనుభవం అంటారు. ప్రజాజీవితానికే అంకితమయ్యాం అంటారు. నిజాయితీ అంటారు. మరి ఇప్పుడు ఇసుక తవ్వుకునేందుకు వచ్చిన ఈ సంస్థ ఎవరిది? 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి,  రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, పోలీస్ శాఖ కలసి చేయలేకపోయారు. మూడు సంవత్సరాల్లో  మూడు విధానాలు తెచ్చారు.

ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒక ప్రయివేటు కంపెనీకి ఇచ్చేస్తున్నారు. వారు చేయగలరా? ప్రతి రీచ్ ఒక ఎమ్మెల్యే వారి పేరు మీద రాసేసుకున్నారు. కొత్త ఇసుక విధానం వల్ల ముందుగా తిరగబడేది ఆ వైసీపీ ఎమ్మెల్యేలే. కొత్త విధానంతో మొత్తం సింగిల్ మ్యాన్ షో అయిపోతోంది. సింగిల్ విండో స్కీమ్ లో ముఖ్యమంత్రి, వారి అనుచరులకు వెళ్తుంది. సామాన్యుడికి ఇల్లు కట్టుకునే కలను ఈ ప్రభుత్వం  నాశనం చేసింది. 
 
అసెంబ్లీ నిర్వహించకపోవడానికి కారణం తెలుసుకోవాలి 
సాధారణంగా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరగాలి. మనం జనవరిలో ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చాం. మరి సమావేశాలు నిర్వహించకపోవడానికి కారణం ఏంటో అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు. కరోనా లేదని మీరే చెబుతున్నారు. అయినా బడ్జెట్ లేదు. లెక్కలు చూపలేరు.

వాస్తవాలు ప్రజలకు చూపలేరు. బడ్జెట్ సమావేశాలకే ప్రభుత్వం దూరమయ్యే పరిస్థితి. దీన్ని ప్రశ్నించాలి. అత్యవసర సమయాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు, ఆర్డినెన్స్ ద్వారా కావచ్చు గవర్నర్ గారి ఆమోదంతో పెట్టుకోవచ్చు. ఆ క్లాజుని ఉపయోగించుకుని బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం తప్పుకుంటోంది. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే అవసరాలు, ఆర్థిక పరిస్థితిని  దృష్టిలో ఉంచుని సంక్షేమం కోసం ఖర్చు చేసిన నిధుల లెక్కలు, అమలుయాపి శ్వేతపత్రం విడుదల చేయాలి.
 
బలిజ సోదరులు అధైర్యపడవద్దు
 జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి జనం విసుగెత్తిపోతున్నారు. ఎక్కడా అధైర్యపడకండి. బలిజ సోదరులందరికీ చెప్పండి. వారికి ధైర్యం నింపుదాం. వ్యాపారాలు, షాపుల్ని చూపి ప్రజాప్రతినిధులే స్వయంగా రంగంలోకి దిగి బెదిరిస్తున్నారు. మీరు భయపడవద్దు,

మీకు ధైర్యం నింపే నాయకుడు పవన్ కళ్యాణ్. స్థానికంగా ఏ సమస్య వచ్చినా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరం అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి మీకు అండగా నిలుస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల యువత నష్టపోతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. . 

తిరుపతిలో క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియను చక్కగా ముందుకు తీసుకువెళ్లారు. సంఖ్య గురించి ఆలోచించడం లేదు. మొదటి విడతలో కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ నమోదు జరిగింది.

సభ్యత్వం ద్వారా రూ. 5 లక్షల ప్రమాద బీమా, ర్యాలీల్లో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఉపయోగపడే విధంగా రూ. 50 వేల మెడికల్ పాలసీలు పవన్ కళ్యాణ్ బీమా కంపెనీలతో మాట్లాడి మరీ తీసుకువచ్చారు. దీన్ని మీరంతా ఉపయోగించుకోండి. దీని ద్వారా కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది” అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments