Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ కోసం కోర్టులను మేనేజ్ చేశారా?: టీడీపీ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (12:36 IST)
16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్ అప్పుడు బెయిల్ కోసం కోర్టులను మేనేజ్ చేశారా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు కోర్టులపై చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన జగన్‌కు ఓ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
 
గౌరవనీయులు శ్రీ వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి గారికి,
విషయం : మీ పార్టీ నేతలు, మీ మంత్రివర్గ సహచరులు, మీ నీలి మీడియా దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఏది వాస్తవమో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.?
 
 
1. 11 చార్జ్‌షీట్లలో నిందితులుగా ఉన్న మీరు బెయిల్‌ పొందారంటే మీరు న్యాయస్థానాలను మేనేజ్‌ చేసినట్లా..?
 
2. భారత రాజ్యాంగం చట్టబద్ద పాలనను అంగీకరిస్తుందేగానీ ఇష్టారాజ్యాన్ని అంగీకరించదు. మెజారిటీ ఉందన్న అహంకారంతో మానవుల ప్రాణాల్ని తీయడం, ప్రజాసందను పాలకులు కొల్లగొట్టడాన్ని అంబేద్కర్‌ రాజ్యాంగం అంగీకరించదు. ప్రజాస్వామ్య హక్కుల్ని, మానవ హక్కుల్ని, జీవించే హక్కుల్ని రక్షించడం న్యాయస్థానాల విధి.

ప్రభుత్వ నిర్ణయాలు చట్టబద్దంగా వుంటే, ప్రజాప్రయోజనాల కోసమే అయితే వాటిపై ఎవరు న్యాయస్థానాలకు వెళ్లినా అవి నిలబడతాయి. చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు న్యాయస్థానాల్లో నలబడవని చరిత్ర రుజువు చేసింది. బ్లాక్‌ మెయిళ్లకు, దుష్ప్రచారాలకు న్యాయస్థానాలు తలవంచవనేది కూడా ఎన్నెన్నో సందర్భాల్లో రుజువైంది.

ఇందిరాగాంధీ గారే న్యాయ స్థానాలను మేనేజ్‌ చేయలేకపోయారని రుజువైంది. ఆమెను కూడా న్యాయస్థానాలు జైలుకు పంపాయనేది చారిత్రక సత్యం కాదా.?
 
3. వై.యస్‌. వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే వారి కుమార్తె న్యాయం స్థానం తలుపులు తట్ట కూడదా.? అది పరిపాలనకు అడ్డుపడటం ఎలా అవుతుంది.?
 
4. ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని జ్యుడిషియల్‌ కస్టడీలోనే హింసిస్తే.. వారు న్యాయస్థానాలకు వెళ్లడం పరిపాలనకు అడ్డుపడటం ఎలా అవుతుంది.?
 
 
5. మాస్క్‌ అడిగిన పాపానికి పెడరెక్కలు విరిసికట్టి నడిరోడ్డుపై పడదోసి కొట్టి చిత్ర హింసలపాలైన డాక్టర్‌ సుధాకర్‌ కేసును న్యాయ స్థానం సుమోటోగా తీసుకోవడం న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగకరమా.? సీబీఐ విచారణకు ఆదేశించకూడదా.?
 
6. తమ జీవనాధారమూ, ప్రాణానికి ప్రాణమైన భూముల్ని ఐదుకోట్ల ఆంధ్రుల కోసం త్యాగం చేసిన రైతుల్ని నిండా ముంచడమే కాక తుగ్లక్‌ లాగా రాష్ట్ర రాజధానిని ముక్కలు చేస్తే న్యాయస్థానానికి కాక మరెవరికి చెప్పుకోవాలి.?
 
7. కరోనా మహమ్మారి కరాళనృత్యం ఆగలేదు. దేశమంతా పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేశాయి. 80 లక్షల మంది ప్రాణాల మీదకు వచ్చే అపాయం వున్నా తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం పరీక్షలు పెడతానంటే న్యాయస్థానాలకు పోకూడదా.?
 
8. లక్ష కోట్ల అవినీతి కోసం సోలార్‌ ప్రాజెక్టును సీఎం కుటుంబ సభ్యులకు, అర్హతలేని బినామీ కంపెనీకి 2003 విద్యుత్‌ చట్ట నిబంధనలకు, కేంద్ర విద్యుత్‌ సంస్థల నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి ప్రజలపై విద్యుత్‌ చార్జీలు పెంచుతుంటే న్యాయస్థానాలకు పోవడం పాలనకు అడ్డుపడటం ఎలా అవుతుంది.? ఇది పాలనకు అడ్డుపడటం కాదు. హోల్‌ సేల్‌ అవినీతికి అడ్డుపడి విద్యుత్‌ చార్జీలు పెరగకుండా రక్షించుకోవడం కాదా?
 
9. మద్యం రేట్లు, ఇసుక రేట్లు, సిమెంట్‌ రేట్లు మూడు రెట్లు పెంచి ప్రజల్ని లూటీ చేస్తుంటే న్యాయ స్థానాలకు వెళ్లక మరెక్కిడి వెళ్లాలి.?
 
10. దేవాలయాలపై ఇబ్బడి ముబ్బడిగా దాడులు చేస్తున్నా.. అసలు నేరస్తుల్ని పట్టుకోవడంలో విఫలమైతే కోర్టుకు వెళ్లకూడదా.?
 
11. లక్ష రూపాయల అవినీతి సమస్యపైన కేంద్రమంత్రి శ్రీ బంగారు లక్ష్మణ్‌ జైలు జీవితం గడిపారు. కొన్ని కోట్ల అవినీతిపై ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జయలలిత, లలూప్రసాద్‌ యాదవ్‌, శిబూసోరెన్‌, ఓంప్రకాశ్‌ చౌతాల జైలు జీవితం గడపలేదా.?
 
12. 2004లో తన తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు రూ.7 లక్షలు మాత్రమే ఆదాయపన్ను కట్టిన జగన్‌ కుటుంబానికి ఇంతలోనే లక్షకోట్ల ఆస్తి ఎలా వచ్చింది.? సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న రూ.43వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది..? కొద్దిపాటి అవినీతికి పాల్పడిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక చట్టం.. జగన్‌ రెడ్డికి వేరొక చట్టమేమైనా వుందా.?
 
13. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీ ఆస్తులు రూ.9వేల కోట్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు జగన్‌ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు పెట్టడం లేదు.? జగన్‌ రెడ్డి కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది.? జగన్‌ రెడ్డి కోర్టు వాయిదాలను దాటవేయకుండా విచారణకు హాజరై నిజాయితీని నిరూపించుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.?
 
14. స్వల్ప తప్పిదానికి రామలింగరాజు గారి సత్యం కంప్యూటర్స్‌ ను స్వాధీనం చేసుకున్నప్పుడు జగన్‌ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోకపోతే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు.? అధికార పదవుల్లో వుంటే నేరాలకు అతీతులా? చట్టాలు వర్తించవా.?
 
15. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ మీడియాపై అక్రమ కేసులు పెట్టి, వారి ప్రసారాలను అక్రమ మార్గంలో నిలిపేస్తే కోర్టులకు కాక మరెక్కడికెళ్లాలి.?
 
16. రెండేళ్లలోనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన 28 మందిని నాయకులు, కార్యకర్తలను హత్య చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, రఘురామకృష్ణంరాజు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, బీసీ. జనార్థన్‌ రెడ్డి, జడ్జి రామకృష్ణ, మాజీ ఎంపీ హర్షకుమార్‌ లాంటి వంటి 20 మంది నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడితే కోర్టుకు కాక మరెక్కడికి వెళ్లాలి.? ఇది పరిపాలనకు అడ్డుపడటమా.?
 
17. అశోక్‌ గజపతిరాజు గారిని అక్రమంగా మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పదవి నుండి తొలగించి క్రిస్టియానిటీని అనుసరిస్తున్న కుటుంబానికి చెందిన శ్రీమతి సంచయితను సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌ గా నియమిస్తే న్యాయస్థానానికి కాకుండా ఎక్కడికి పోవాలి.?
 
18. తెలుగుదేశంగానీ, ప్రతిపక్షాలు గానీ, పౌరులుగానీ, సంస్థలు గానీ కోర్టుకు వెళ్లడం తప్పైతే జగన్‌ రెడ్డి కుటుంబం చంద్రబాబు నాయుడు గారిపైన అక్రమంగా 18 కేసులు ఎందుకు పెట్టారు.? 26 సభాసంఘాలు ఎందకు నియమించారు.?
 
19. చంద్రబాబు గారు తాను సీఎంగా వుండగా తనపై వున్న కేసులను తాను ఉపసంహరించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. పైగా తనపై ఆరోపణలు వస్తే తన కుటుంబ ఆస్తుల్ని బహిరంగంగా ప్రకటించారు. ఇలా చేయకుండా జగన్‌ రెడ్డి తనపై ఉన్న 11 కేసుల్ని ఉపసంహరించుకోవడం కంచే చేను మేయడం కాదా? అధికార దుర్వినియోగాన్ని సుమోటోగా ఎందుకు తీసుకోకూడదు.?
 
20. స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాల ద్వారా పోలీసులు బెదిరింపుల ద్వారా, సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరించి, దొంగ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యా ఎన్నికలను
ఉక్కుపాదాల కింద నలిపేస్తే న్యాయ స్థానాలను కాక మరెక్కిడి వెళ్లాలి.?
 
21. తెలుగుదేశానికి న్యాయ స్థానాలను మేనేజ్‌ చేసే శక్తి వుంటే చేయని నేరానికి అచ్చెన్నాయుడు 70 రోజులు ఎందుకు జైల్లో వుంటారు.? కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్‌, బీసీ జనార్థన్‌ రెడ్డి, బీటెక్‌ రవి లాంటి వారు అన్ని రోజులు జైల్లో ఎందుకు వుంటారు.?జగన్‌ రెడ్డి బెయిల్‌ పై వుండి ఇన్ని నేరాలు, తిరిగి ప్రజాసంపదను హోల్‌ సేల్‌ లూటీ చేస్తుంటే ఇంకా బెయిల్‌ రద్దు కాకుండా ఎలా వుంటుంది..?
 
జగన్‌ రెడ్డి తన నేరాల్ని, హోల్‌ సేల్‌ లూటీని, చట్టమంటే లెక్కలేని తనాన్ని మానుకోకుండా న్యాయస్థానాల్ని బ్లాక్‌ మెయిల్‌ చేసే దుష్ప్రచారం వల్ల చివరకు మూల్యం చెల్లించుకోకతప్పదని గ్రహించాలి.

ప్రజల్ని, ప్రతిపక్షాలను పోలీసు బలగాలతో ఎల్లకాలం అణచివేయగలననుకుంటే హిట్లర్‌ను చూసి ఏమీ నేర్చుకోకపోవడమే అవుతుంది. సీబీఐ కోర్టు విచారణలకు హాజరై జగన్‌ రెడ్డి తన నిజాయితీని రుజువు చేసుకోవాలి… లేదా దోపిడికీ తగిన శిక్ష అనుభవించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం