తన కుమార్తెను ఓ పోకిరి వేధించడానికి కారణమైన ఓ మహిళను ఓ వ్యక్తి గొంతు కోశాడు. పట్టపగలు, అందరు చూస్తుండగా నడి రోడ్డుపై గొంతుకోశాడు. ఈ దారుణం కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది.
బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్ధవటం రోడ్డులోని నూర్ బాషాకాలనీలో టైలర్‌గా రాయపాటి బాషా అనే వ్యక్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమారులు. చిన్న కుమార్తె భర్త బెంగళూరులో పని చేస్తుండటంతో ఆమె మాత్రం తండ్రివద్దే నివశిస్తోంది.
ఈ క్రమంలో ఆమెకు ఓ ఫోన్ నంబర్ నుంచి తరచూ రాంగ్ కాల్స్ వస్తుండటం, వేధిస్తుండటంతో బాషా మరో నంబర్ నుంచి అదే ఫోన్‌కు కాల్ చేసి నిలదీశాడు. తనకు అదే కాలనీలో ఉండే వెంకట సుబ్బారెడ్డి భార్య సుబ్బలక్ష్మమ్మ ఫోన్ నంబర్ ఇచ్చిందని చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
తన కుమార్తె ఫోన్ నంబర్‌ను అపరిచితుడికి ఎందుకు ఇచ్చావంటూ ఆమెతో పలుమార్లు గొడవకు దిగాడు. అయినా ఆ అపరిచితుడు మాత్రం ఫోన్ చేస్తూ టార్చర్ పెట్టసాగాడు. దీంతో పాల కోసం బయటకు వచ్చిన సుబ్బలక్ష్మమ్మపై బాషా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.
ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి బాషాను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.