ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని విధులు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈమె పదవీకాలం ఎపుడో ముగిసింది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆమె పదవీకాలాన్ని పొడగించారు. ఈ పొడగింపు కూడా ఈనెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరన్న అంశంపై ఇపుడు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రస్తుతం నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సతీష్ చంద్ర ముఖ్యమంత్రి పేషీలో స్పెషల్ సెక్రటరీగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పట్ల జగన్ సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. అలాగే, జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు ఆసక్తి లేదని చెపుతున్నారు.
అయితే, నీరబ్ కుమార్‌కు 2024 జూన్ వరకు సర్వీస్ ఉంది. ఆయనను సీఎస్‌గా నియమిస్తే మిగిలిన కొందరు ఆ స్థానంలో పని చేసే అవకాశం కోల్పోతారనే యోచనలో జగన్ ఉన్నారు. దీంతో, ఆదిత్యనాథ్ దాస్ వైపు జగన్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయనను సీఎస్ కార్యాలయంలో ఓఎస్డీగా నియమించనున్నట్టు సమాచారం. నెలాఖరు వరకు ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నెలాఖరున నీలం సాహ్ని రిటైర్ అయిన వెంటనే కొత్త సీఎస్ గా ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జూన్‌లో దాస్ పదవీ విరమణ చేయనున్నారు. బీహార్‌లో పుట్టిన ఆదిత్యనాథ్ 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిజాయితీ కలిగిన సీనియర్ అధికారుల్లో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు.