ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌పై అధికారులకు సీఎం జగన్ మార్గదర్శకాలు ఇచ్చారు. ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
రెండు వేల జనాభా యూనిట్‌గా, స్థానిక పరిస్థితులకు తగ్గట్లు విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకా.. ‘ వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లో 24 గంటలు ఒక బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండాలి.
ప్రతి గ్రామ, వార్డు సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలి. రోగి ఎవరొచ్చినా విలేజ్ క్లినిక్ రిఫరల్ పాయింట్‌లా పని చేయాలి.
రోగికి ఏదైనా జరిగితే సదరు ఆస్పత్రికి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుందని సలహాలు, సూచనలు ఇచ్చేలా విలేజ్ క్లినిక్ ఉండాలి’ అని అధికారులకు జగన్ సూచనలు ఇచ్చారు.
బేసిక్ మెడికేషన్ ఇవ్వడమే విలేజ్ క్లినిక్ లక్ష్యమని, రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం చేయాలన్న లక్ష్యంతోనే దీన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం చెప్పారు.
చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే చికిత్సలు, మందులు ఇవ్వాలని, పెద్ద సమస్యలకు రెఫరల్ పాయింట్‌గా పనిచేయాలని అన్నారు.
ఇక, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హస్పిటల్ ఉండాలని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 టీచింగ్ హాస్పిటల్స్ ఉండాలని ఆదేశించారు. ప్రతి టీచింగ్ హాస్పిటల్‌లో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని అన్నారు.
కాగా, 7 మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. సమీక్షకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.