Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానాలను అవలీలగా మేనేజ్ చేసే చంద్రబాబు సుప్రీంకోర్టుకు బుక్ కావడం ఖాయమేనా?

‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించడంతోపాటు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటి

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (04:00 IST)
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించడంతోపాటు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ విచారణార్హం కాదన్న బాబు తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

 
'ఓటుకు కోట్లు’ కేసు పూర్వాపరాలు గమనిస్తే ఇన్నాళ్లుగా దర్యాప్తు అతీగతీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ దర్యాప్తు ఎలా కొనసాగించాలో, నిందితుల దోషాన్ని ఎలా నిరూపించాలో తలలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. కీలక నిందితులు ఆడియో, వీడియోల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి జరిగిన ఎన్నికల్లో కరెన్సీ కట్టలను ఎర చూపడం కేసులోని ప్రధానాంశం. ఆ కరెన్సీ కట్టలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ దగ్గరకు పట్టుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో కెమెరాలకు చిక్కారు. 
 
ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన అవాకులు, చవాకులు రికార్డయ్యాయి. ఒక్క ఓటుకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన ఆ కేసులో సాక్షాత్తూ చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణలు సైతం ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే ఈపాటికి నిందితుల దోషం నిరూపణై న్యాయస్థానంలో శిక్ష కూడా పడేది. కానీ జరిగింది వేరు.
 
‘నా ఫోన్‌ ట్యాప్‌ చేయిస్తారా...’ అంటూ ఉగ్రుడైన చంద్రబాబు ‘నాకూ ఏసీబీ ఉంది. నాకూ పోలీసులున్నారు...’ అంటూ హుంకరించారు. ఆ హుంకరింపులే ఆయన దోషాన్ని పట్టి ఇచ్చాయి. ఆయన స్పందన గమనిస్తే ఎవ రికైనా ఆశ్చర్యం కలుగుతుంది. రేవంత్‌రెడ్డిని తాను పంపలేదని, ఆయన ఇవ్వజూ పిన డబ్బుతో తనకు సంబంధం లేదని చంద్రబాబు అనలేదు. కనీసం స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు తనది కాదని కూడా బాబు బుకాయించలేదు. ఆ సంగతలా ఉంచి ఫోన్‌ సంభాషణ టేపుల్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి నిజా నిజాలేమిటో నిర్ధారణ చేయించడం తెలంగాణ సర్కారుకు పెద్ద కష్టమేమీ కాదు. చిత్రమేమంటే హైదరాబాద్‌లోనే ఉన్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఆ టేపులు ఈనాటికీ చేరినట్టు లేవు. 
 
ఇలా వ్యక్తుల ఇష్టానుసారం కేసుల దర్యాప్తు సాగడం ప్రజాస్వా మ్యంలో అవాంఛనీయం. ఇదేమీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సొంత పంచా యతీ కాదు. వారిద్దరూ లాలూచీ పడి ‘గతం గతః’ అనుకుంటే సరిపోదు. పక్క రాష్ట్రం ఎమ్మెల్యేలను  డబ్బిచ్చి కొనడానికి... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడానికి సిద్ధపడి ఒక ముఖ్యమంత్రి సంచుల్లో కరెన్సీ కట్టలు పంపిన ఉదంతమిది. ఇందులో నెలల తరబడి సాగలాగేది, చెమటోడ్చి వెలికితీసేది ఏముం టుందో ఎవరికీ అర్ధంకాని విషయం.

గత నెలలో ఏసీబీ అదనపు చార్జిషీటు దాఖలు చేసిందంటున్నారు. మంచిదే. మరి చంద్రబాబు జరిపిన ఫోన్‌ సంభాషణల టేపుల సంగతి ఏంచేశారో ఎవరికీ తెలియదు. ఫోన్‌లో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఒక ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారణగా చెప్పింది. చేతనైతే ఆ ల్యాబ్‌ నివేదిక తప్పని అయినా తెలంగాణ ఏసీబీ నిరూపించాలి. అది ఆ పనీ చేయలేదు!
 
ఈ కేసులో చంద్రబాబు మొదటినుంచీ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలి గిస్తుంది. దర్యాప్తు సక్రమంగా సాగడంలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు ఇందులో ఆయన జోక్యం తగదని బాబు తరఫు న్యాయవాది వాదించారు. చివరకు దర్యాప్తు వేగవంతం చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించినప్పుడు దానిపై బాబు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దుచేస్తూ తీర్పు వెలువడి ఉండొచ్చుగానీ... ఆ సందర్భంగా బాబు వినిపించిన వాదనలు వింత గొలుపుతాయి. 
 
ప్రజా ప్రతినిధులుగా ఉంటున్నవారు ఏదైనా ఎన్నికల్లో ఓటేయడం రాజ్యాంగ బాధ్యతే తప్ప అది ప్రజావిధుల్లో భాగం కాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ప్రజావిధుల్లో భాగం కాదు గనుక ఓటేయడానికి డబ్బు తీసుకున్నా నేరం కాదన్నట్టు ఆ వాదన సాగింది. తనపై ఇంతవరకూ 26 కేసులు దాఖలు చేసినా అన్నిటిలోనూ తాను నిప్పునని నిరూపించుకున్నానని బయట నదురూ బెదురూ లేకుండా దబాయిస్తూ న్యాయస్థానాల్లో మాత్రం ఇలాంటి వాదనలు వినిపించడానికి బాబుకు సిగ్గనిపించడం లేదు.
 
ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం అసాధారణం. ఇది నైతికంగా బాబుకు పెద్ద దెబ్బ. కేసులో తేల్చాల్సిన అంశాలున్నాయని ప్రాథమికంగా భావించబట్టే సుప్రీం కోర్టు ఈ నిర్ణయానికొచ్చింది. కేసు విచారణలో ఎలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవచ్చునో నేర విచారణ స్మృతి నిబంధనలు చెబుతున్నాయి. 
 
ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న కేసుల్లో ప్రభుత్వాలు కావాలని నిందితులను కాపాడ టానికి ప్రయత్నిస్తుంటే మూడో వ్యక్తి జోక్యం సబబేనని సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. వీటన్నిటినీ గమనించాకైనా ఇది నైతికంగా తనకు పరాజయమని బాబు గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నది గనుక ఈ కేసు దర్యాప్తు ఇకనుంచి అయినా చురుగ్గా, సక్రమంగా సాగుతుందని... సాధ్య మైనంత త్వరలో దోషులకు శిక్ష పడుతుందని ఆశిద్దాం.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

ఒక పథకం ప్రకారం సాయిరాం శంకర్ చేసింది ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments