తనకు ఒక్కసారి అవకాశమంటూ వస్తే హోం మంత్రి బాధ్యతలు చేపడుతానని, ఆ తర్వాత రెడ్ బుక్ అంటూ ఏదీ ఉండదని అంతా బ్లడ్ బుక్కే ఉంటుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు అన్నారు. నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా 24 ద్వైవార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొని, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక్క రోజు గనుక మిమ్మల్ని రాష్ట్రమంత్రిగా చేస్తే మీరు ఏ శాఖ కోరుకుంటారంటూ అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనకు అలాంటి అవకాశం అంటూ వస్తే రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే ఆరు గంటలు హోం మంత్రిగాను, మిగిలిన 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేస్తానని తెలిపారు.
ఆ తర్వాత మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. హోం మంత్రిగా అయితే, రెడ్ బుక్ అమలు చేస్తారా అని ప్రశ్నించగా, తన వద్ద రెడ్ బుక్ ఉండదని, అది వేరే వాళ్లవద్ద ఉందని రఘురామ బదులిచ్చారు. అయితే, తనవద్ద బ్లడ్ బుక్ ఉందని స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయని రఘురామ అన్నారు. ఆ విధంగా తాను బ్లడ్ బుక్‌లో ముందుకెళతానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.