ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమేజాన్. ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల కస్టమర్లను కలిగివుంది. ఈ సంస్థ సేవలను కూడా అత్యుత్తమ స్థాయిలో అందిస్తోంది. దీంతో అనేక మంది నెటిజన్లు ఈ సంస్థ వెబ్‌సైట్ ద్వారా వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఆ సంస్థలో పని చేసే కొందరు సిబ్బంది ఇంటి దొంగలుగా అవతారమెత్తి.. సంస్థకే టోకరా వేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన మోసం వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్, కాచిగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన అంకుశ్ బిరజ్‌దర్ అనే వ్యక్తి మాదాపూర్‌లోని అమేజాన్ ఆన్‌లైన్ సైట్ కంపెనీలో రిస్క్ ఇన్విస్టిగేటర్ అఫ్ ట్రాన్‌జాక్షన్స్ టీమ్, రిస్క్ మేనేజ్‌మెంట్ టీమ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయన తన విధులను నిర్వహిస్తూనే... ఆన్‌లైన్‌లో సంస్థను ఎలా మోసం చేయవచ్చు, అందులో ఉండే లోటుపాట్లు, తదితర వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.
దీంతో తన స్నేహితుడైన పురానిహేవెలిలో నివాసముండే మిర్ ఫిరోజ్ అలీ అలియాస్ హసన్‌కు తెలియజేశాడు. అంతటితో ఆగని అంకుశ్... ఓ బ్యాంకు ఖాతా, నకిలీ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి వాటి ద్వారా ఆన్‌లైన్‌లో ఖరీదైనా లేటెస్ట్ ఐఫోన్లు కొనాలంటూ సూచించాడు. ఇక అప్పటి నుంచి అమేజాన్ సైట్‌లో ఖరీదైన ఫోన్లను, తన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా సెల్‌ఫోన్‌కు నగదును చెల్లించి, హసన్ కొనుగోలు చేస్తూ వచ్చాడు.
అతను చేసిన అర్డర్ మేరకు సంస్థ ఐఫోన్‌ను సూచించిన చిరునామాకు కొరియర్‌లో చేరవేస్తూ వచ్చింది. ఐఫోన్‌ను తీసుకున్న తర్వాత అసలైన ఫోన్‌ను తీసేసుకొని, దాని స్థానంలో చైనా ఫోన్‌ను పెట్టి ప్యాక్ చేసి.. మీరు పంపించిన సెల్‌ఫోన్ డ్యామేజ్ ఉంది, సరిగా పనిచేయడం లేదు అంటూ ఇలా పలురకాలైన కారణాలను సూచిస్తూ, దాన్ని తిరిగి సంస్థకు రిటర్న్ చేస్తూ వచ్చాడు. ఈ ఫోన్‌ను రీసివ్ చేసుకున్న వెంటనే, అతడు అంతకు ముందు బ్యాంకు ద్వారా చెల్లించిన మొత్తాన్ని, అదే ఖాతాలోకి బదిలీ చేస్తూ వచ్చింది.
తన ఖాతాదారులకు అత్యుత్తమైన సేవలు అందించాలన్న కారణంతో ఎలాంటి క్రాస్ తనిఖీలు లేకుండా డబ్బులు రిటర్న్ చేస్తూ వచ్చింది. అయితే, పదేపదే అదే ఒకే కస్టమర్ నుంచి వస్తువులు తిరిగి వస్తుండటంతో సందేహించిన అమేజాన్ ప్రతినిధులు.. ఆరా తీసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం గుట్టు బయటపడింది. దీంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అంకుశ్, హాసన్‌లను అరెస్టు చేసి, వారి నుంచి 6 యాపిల్ ఐఫోన్లు, కంప్యూటర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.