రాజకీయ శక్తిగా ఎదగడమే తమ ప్రజా ఫ్రంట్ లక్ష్యమని తెలంగాణా ప్రజా ఫ్రంట్ నాయకుడు గద్దర్ ప్రకటించారు. శనివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో గద్దర్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా ఉద్యమించడం ద్వారా తెలంగాణాను సాధిస్తామన్నారు.
ముఖ్యంగా తెలంగాణా వనరులను కాపాడుకోవడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణా ప్రజా ఫ్రంట్ రాజకీయ నాయకుల నుంచి పుట్టలేదనీ, గ్రామ పునాదుల నుంచి తెలంగాణాలో ఉన్న అనేక జేఏసీల నుంచి పుట్టుకొచ్చిందన్నారు.
పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేవరకూ తమ ఫ్రంట్ ఉద్యమం చేస్తూనే ఉంటుందన్నారు. అదే తమ ప్రధమ లక్ష్యమని వెల్లడించారు. తెలంగాణాకు ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూనే ఉన్నదని ఆ పార్టీని దుయ్యబట్టారు.
ఇక తెలంగాణాకోసమే అంటూ ఉద్భవించిన పార్టీలు సైతం తెలంగాణా ప్రజలతో ఆటలాడుకుంటున్నాయనీ, ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి తప్ప తెలంగాణా సాధన దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు.
తమ ఈ ఫ్రంట్‌లో తెలంగాణాకు చెందిన ఎన్నో జేఏసీలు, పార్టీలు, ప్రజలు, ఉద్యమ నేతలున్నారన్నారు. వీరితోపాటు తెలంగాణాకోసం కృషి చేస్తున్న అన్ని శక్తులను కలుపుకుని ముందుకు వెళతామన్నారు. గతంలో తామేమైనా తప్పులు చేసి ఉంటే మన్నించాలని తెలంగాణా ప్రజలను కోరారు. తెలంగాణాకు నవంబరు 1న అన్యాయం జరిగింది కనుక ఆ రోజును విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణా ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంకేతంగా ప్రతి ఒక్కరు నల్ల బ్యాడ్జీలను ధరించాలని కోరారు.