రాష్ట్రాన్ని ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే మూడు చిన్న రాష్ట్రాల కోసం ఏర్పాటు కోసం పోరాడుదామని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తాను ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసమే సద్భావన యాత్రలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలైన ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలను కూడా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని ఉద్యమిద్దామన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన సద్భావన యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎన్ని ముక్కలైనా తెలుగువారంతా ఆత్మీయంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రభుత్వాలు విలువనివ్వడం లేదన్నారు.
రాష్ట్రంలో నాయకత్వ లోపం ఏర్పడిందని, అన్ని ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనే పాలకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై మెజార్టీ ప్రజల కోరికను ఆమోదించాల్సిన ప్రభుత్వాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
కొంతమంది నేతలు రాష్ట్ర విభజనను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్యవాదాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, కేవలం పెట్టుబడిదారులు మాత్రమే డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయంగా కలిసి ఉండాలని చెప్పేందుకే సద్భావన యాత్రను ప్రారంభించామన్నారు. చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్న ఆయా ప్రాంతాల ఉద్యమకారులంతా కలిసి రావాలని కోరారు. ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ రాకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపించారు.