ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో నాలుగోరోజు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. ముందుగా టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పప్పులు నిప్పులయ్యాలన్నారు.
వంట నూనె, కూరగాయల ధరలు చుక్కలంటాయని.. వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని భవానీ డిమాండ్ చేశారు. ఇవన్నీ చాలనట్టు ఇటీవలే ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారని ఆమె గుర్తు చేశారు.
ఆదిరెడ్డి భవానీ ప్రశ్నలకు పౌరసరపరాల శాఖా మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చారు. ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని చెప్పారు. వాటిని ధరల పెరుగుదలగా పరిగణలోకి తీసుకోరని వెల్లడించారు.
ఈ సందర్భంగానే ఆయన పప్పుల రేట్లు గురించి మాట్లాడుతుండగా.. ఆయన వెనక ఉన్న వైసీపీ సభ్యులు ఏ పప్పు అని సరదాగా వ్యాఖ్యానించగా, అప్పుడు నాని ఆ పప్పు కాదు లెండి.. కందిపప్పు అండి ఆన్సర్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.
ఇక వైసీపీ వాళ్లు నారా లోకేష్‌ను పప్పు అని విమర్శించడం అందరికి తెలిసిందే. ఇప్పుడు నాని కూడా లోకేష్ పేరు ఎత్తకపోయినా పరోక్షంగా ఆ పప్పు కాదు… కందిపప్పు అని చమత్కరించారు.