తాను నడుపుతున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కోన మధుసూదన్ (33) కన్నుమూశారు. ఆయన పెళ్ళిరోజే చనిపోయారు. ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, నల్లగొండలో నిర్వహిస్తున్న పోలీస్ దేహదారుఢ్య పరీక్షల విధులు నిర్వహించేందుకు భూదాన్‌పోచంపల్లి నుంచి స్వయంగా పోలీస్ సుమో వాహనం నడుపుతూ ఇంటి నుంచి ఉదయం 4.30 గంటలకు ఆయన బయలుదేరారు.
ఆయన వాహనం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను బెటాలియన్ పోలీసులు 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 5.30 గంటలకు తరలించారు. గంటకు పైగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. చివరకు తుదిశ్వాస విడించారు.
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వచ్చిన మధుసూదన్... సోమవారం రాచకొండ ఉత్సవాల్లో కూడా విధులు నిర్వహించారు. సెలవు కావాలని ఉన్నతాధికారులను కోరడంతో రెండు రోజులు సెలవు ఇచ్చిన అధికారులు రాత్రి సెలవు రద్దు చేస్తున్నామని ఈవెంట్స్ విధులకు వెళ్లాలని ఆదేశించడంతో డ్రైవర్ లేకుండానే విధులకు సిద్ధమయ్యాడు.
తన కుమార్తె అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పడంతో మధుసూదన్ అతడికి సెలవు ఇచ్చాడు. స్వయంగా వాహనం నడపడం, అనారోగ్యం, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సెలవు ఇచ్చినట్టే ఇచ్చి గంటల వ్యవధిలోనే రద్దు చేశారని, అదే తమ కుటుంబానికి అండలేకుండా చేసిందని వారు వాపోతున్నారు.