పాకిస్థాన్‌పై ఎయిర్ స్ట్రయిక్‌లు చేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని విజయం సాధించిన నేపథ్యంలో అసలు వీటన్నింటికీ కారణమైన పుల్వామా దాడులను అసలు ఉగ్రదాడులే కాదనేస్తున్నారు కొంత మంది ప్రముఖులు. మొన్నటికి మొన్న వ్యాఖ్యానించింది ప్రతిపక్ష నేత అయితే... అధికార పక్షం విరుచుకుపడిపోయింది కానీ... ఈసారి సొంతగూటి చిలకే ఈ విధమైన ప్రకటన చేయడం ప్రతిపక్షాలకి మరింత ఊతమిచ్చినట్లయింది.
వివరాలలోకివెళ్తే... పుల్వామాలో జరిగింది అసలు ఉగ్రదాడి కాదనీ, అది ప్రమాదవశాత్తూ జరిగింది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలతో ఆయనపై ఆగ్రహించిన బీజీపీ సీనియర్ మంత్రులు, నేతలు దిగ్విజయ్‌ని పాకిస్తాన్ మద్దతుదారుడంటూ, ఆయనపై విమర్శల వర్షం కురింపించారు.
ఈ వివాదం సద్దుమణిగిపోకముందే ఈసారి భాజపా ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ మాత్రమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భాజపాని ఇరుకున పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన దిగ్విజయ్.. ‘ఇప్పుడేమంటారు మోడీ’ అంటూ ప్రశ్నించారు.
ట్విట్టర్ వేదికగా దిగ్విజయ్ మోడీని ఉద్దేశించి ‘పుల్వామా ఉగ్ర దాడిని నేను ప్రమాదవశాత్తూ జరిగింది అంటే నా మీద అందరూ విరుచుకుపడ్డారు. ఓ ముగ్గురు కేంద్ర మంత్రులైతే.. నాపై ఏకంగా పాకిస్తాన్ మద్దతుదారుడిని అనే ముద్ర వేసేసారు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకుడు.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య కూడా పుల్వామా ఉగ్రదాడిని ఓ యాక్సిడెంట్ అని స్పష్టం చేసారు. దీనిపై మీ స్పందన ఏమిటి.. మినిస్టర్‌పై మీరు తీసుకోబోయే చర్యలేంటి మోడీజీ’ అంటూ ట్వీట్ చేసారు. మరి ఏ విధమైన చర్యలు తీసుకోనున్నారో మోడీగారికే తెలియాలి.