Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో సుదీర్ఘ యుద్ధం చేయాల్సిందే

కరోనాతో సుదీర్ఘ యుద్ధం చేయాల్సిందే
, సోమవారం, 4 మే 2020 (20:09 IST)
కరోనా వైరస్ తో మానవాళి సుదీర్ఘ యుద్ధం చేయాల్సి వుందని, 18 నుంచి 24 నెలల పాటు కొవిడ్-19 వైరస్ నిలిచి వుంటుందని, మిన్నెసొటా యూనివర్సిటీ అధీనంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజ్‌ రిసెర్చ్‌ అండ్‌ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ) శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ప్రస్తుతం అమెరికాలో 5 నుంచి 15 శాతం జనాభా మాత్రమే వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని, దాని ఆధారంగానే ఓ రిపోర్టును తయారు చేశామని, ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది వైరస్ ను తట్టుకొనే శక్తిని సంతరించుకునేంత వరకూ వైరస్ ను నియంత్రించలేమని వెల్లడించారు.

కరోనా వైరస్ శరీరంలో ఉన్నా, ఎలాంటి లక్షణాలూ బయట కనపడకుండా ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని, లోలోపల ఇన్ఫెక్షన్‌ ముదిరిపోతున్నా, లక్షణాలు త్వరగా బయటపడకుంటే, వైరస్‌ వ్యాప్తిని అంత సులువుగా అడ్డుకోలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

"ది ఫ్యూచర్ ఆఫ్ ది కొవిడ్-19 పాండమిక్: లెసన్స్ లెర్నడ్ ఫ్రమ్ పాండమిక్ ఇన్ ఫ్లూయంజా" పేరిట తయారైన ఈ నివేదికలో, ఈ వైరస్ ప్రవర్తిస్తున్న తీరును, ఇది మానవాళిపై చూపుతున్న ప్రభావాన్ని సైంటిస్టులు విశ్లేషించారు. ఈ సంవత్సరం చివరి వరకూ కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని, అన్ని దేశాలూ, తమ తమ ప్రాంతాలను, ప్రజలను పరిరక్షించుకునేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖలు తమ వ్యూహాలకు పదును పెట్టుకోవాలని, హెల్త్ కేర్ వర్కర్లను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ మహమ్మారి ఇప్పుడప్పుడే పోదన్న వాస్తవాన్ని జీర్ణించుకుని, ప్రజలు కూడా రాబోయే రెండేళ్ల పాటు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, తట్టుకుని నిలిచేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు ఈ నివేదికలో కోరారు.

"ఈ వైరస్ లక్షణాలు ఏంటన్న విషయం సంపూర్ణంగా ఇంతవరకూ ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలకు తెలిసినంత వరకూ గతంలో వచ్చిన ఇన్ ఫ్లూయంజా వైరస్ లతో పోలిస్తే ఇది భిన్నం. ఇన్ ‌ఫ్లూయెంజాను అదుపులోకి తెచ్చినంత సులువుగా కరోనాను నిలువరించలేము" అని హెచ్చరించారు.

లాక్ ‌డౌన్ ల నుంచి ప్రపంచ దేశాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయని, వాక్సిన్ రాకముందే, జనసంచారం మొదలైన తరువాత మళ్లీ కరోనా ముసురుకోవడం తథ్యమని వారు హెచ్చరించారు.విపత్తు ముగియలేదని ప్రపంచదేశాలు గ్రహించాలని అన్నారు.

ఒకవేళ ఎంతో మంది ఆశలు పెట్టుకున్నట్టుగా, డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, అవి డిమాండ్ ను ఏ మాత్రమూ తీర్చలేవని, చాలా తక్కువ డోసులే అందుబాటులో ఉంటాయని మరువరాదని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లస్టర్ల విభజనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు