వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదము. అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం-11, వ్యయం-30, రాజపూజ్యం 2, అవమానం - 6
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం వీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, మనోవాంఛలు నెరవేరుతాయి. ఉత్సాహంగా ముందుకు దూసుకెడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెద్దమొత్తం పొదుపు చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. బ్యాంకు రుణాలు, ఇతరత్రా ధనం అందుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. దూరపు బంధువులు మరీ దగ్గరవుతారు. తరచుగా బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. అవివాహితులకు శుభయోగం.
లావాదేవీలు చురుకుగా సాగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి.
వాస్తుదోష నివారణ చర్యల ఫలితం తక్షణం కనిపిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగపరంగా మంచి పరిణామాలున్నాయి. మీ సమర్ధత అధికారులను ఆకట్టుకుంటుంది. నగదు బహుమతి, పదోన్నతి వంటి పురస్కారాలు అందుకుంటారు.
ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, కోరుకున్న చోటికి స్థానచలనం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉపాధి పథకాలు చేపడతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. పంటల దిగుబడి, మద్దతు ధర సంతృప్తినిస్తాయి.
ప్రధానంగా అరటి, చెరకు మొక్కజొన్న పత్తి రైతులకు ఆదాయాభివృద్ధి. పంట అమ్ముకునే సమయంలో దళారులను ఆశ్రయించవద్దు. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలుంటాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. మీ పరిశ్రమల్లో పలువురికి ఉద్యోగవకాశాలు కల్పిస్తారు.
విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగల్గుతారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. టివి, చిత్రపరిశ్రమకు చెందిన కళాకారులకు విజయావకాశాలున్నాయి. వీరికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విజయాలు, అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిన్నాయి. వీరి పేరిట ఆస్తులు సమకూరుతాయి. అందరిలోను ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు.
మీ శ్రీవారి బంధువర్గాలతో విభేదాలు తలెత్తుతాయి. తరచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వీరికి ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలున్నాయి. వీరి యత్నాలకు శ్రీవారు, సోదరులు ప్రోత్సహిస్తారు.
వీరి పేరిట పరిశ్రమలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఈ రాశివారికి విదేశీ సందర్శనలకు పాస్ పోర్టు వీసాలు మంజూరవుతాయి. ధార్మిక, యోగాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆధ్మాత్మిక సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సర శుభదాయకంగా ఉంటుంది.