తుల
తులారాశి : చిత్త 3,4 పాదములు, స్వాతి 1 2 3 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం - 5, వ్యయం- 14, రాజపూజ్యం - 6, అవమానం - 3
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం అంతా ఫలప్రదంగా ఉంటుంది. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు పోగలరు. యత్నాలకు దైవబలం తోడవుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ధనానికి ఇబ్బంది ఉండదు.
అవసరాలకు ఏదో ఒక మార్గంలో ధనం సమకూరుతుంది. సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి. సొంత ఇల్లు, వాహనం అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ప్రముఖులకు మరింత సన్నిహితులవుతారు.
ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఒకరి వద్ద మరొకరి గురించి మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకుంటారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వివాహయత్నం ఫలించే అవకాశం ఉంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి.
స్తోమతకు మించి హామీలు, సాధ్యం కాని కోరికలు కోరవద్దు, ముఖ్యంగా జాతక పొంతన ప్రధానమని గమనించండి. పుణ్యక్షేత్ర సందర్శనాలు, గృహంలో శుభకార్యాలతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు సైతం మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసివస్తుంది.
మీ పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుర కలిసివస్తాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, కోరుకున్న చోటికి స్థానచలనం, విదార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగుంటాయి.
లక్ష్యసాధనకు వీరు మరింత శ్రమించాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా చదువు పైనే దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు, ర్యాగింగ్ వంటి విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఈ సంవత్సరం ఆశాజనకం. అధిక పంట దిగుబడులు సాధించటంతో పాటు మద్దతు ధర కూడా పొందుతారు. మెట్టరైతులకు కొంత మేరకు మెరుగ్గా ఉంటుంది.
కూరగాయలు, పండ్లు, పూలు సాగుచేసే రైతులకు సామాన్యంగా ఉంటుంది. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామికంగా నూతన వ్యాపారాలు చేపడతారు. హోల్‌సేల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో స్టాకిస్టులు తగు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.
ఆక్వా రంగ రైతులు మరింత లాభాలు గడిస్తారు. కోళ్లఫారం రైతులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి. అంతు తెలియని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడే సూచనలున్నాయి. ఈ రాశివారు అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురైనా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.
అవివాహితులకు శుభయోగం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉన్నాయి. నిత్యం ఆప్తులతో సంభాషిస్తుంటారు. బంధుమిత్రుల రాకపోకలతో గృహం సందడిగా ఉంటుంది. మీ చొరవతో సన్నిహితుల ఇంట శుభకార్యం జరుగుతుంది. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఏ సంవత్సరం వ్యవహార జయం, కార్యసిద్ధి, ధనలాభం, వస్త్రప్రాప్తి, శత్రువులపై విజయం వంటి శుభఫలితాలున్నాయి.