కన్య
కన్యా రాశి: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1 2 3 4 పాదములు, చిత్త 1, 2 పాదములు
ఆదాయం - 8, వ్యయం-11, రాజపూజ్యం-3, అవమానం-3
ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా వేసుకున్న బడ్జెట్ నిరుత్సాహపరుస్తుంది. దుబారా, ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి.
రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆపత్సమయంలో ఆప్తుల సాయంతో కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు మధ్యవర్తులను ఆశ్రయించటం వల్ల నష్టపోవలసి వస్తుంది. నిరుత్సాహానికి గురికాకుండా యత్నాలు సాగండి.
త్వరలో శుభకార్యం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురవుతుంటారు. ఆహార నియమాలు, ఔషధ సేవనంలో అలక్ష్యం తగదు. సోదరీ సోదరులతో సత్సంబంధాలు ఉంటాయి. ఎవరితోనూ అతిగా మెలగవద్దు. మీ సాయం పొందిన వారే వ్యతిరేకులవుతారు.
దంపతుల మధ్య స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. అగ్రిమెంట్లు, బయానా చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని విషయాల్లో ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ఆత్మస్థైర్యమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
వీరి పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. ధన ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురికాకండి. పరిచయం లేని వ్యక్తుల వల్ల సమస్యలెదురవుతాయి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నిరాశాజనకం. ఎంతగా శ్రమించినా యాజమాన్యం మెప్పు పొందటం కష్టమే.
చీటికి మాటికి ఏదో ఒక సమస్యతో తల్లడిల్లుతుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూల్లో వారి ప్రతిభ ప్రశంసనీయమవుతుంది. వ్యవసాయ పరంగా ఈ సంవత్సరం రైతులకు కష్టకాలమే. వీరికి మొదటి పంట కంటే రెండో పంట అత్యధిక దిగుబడి సాగిస్తారు. దళారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వరి, జొన్న, మొక్కజొన్న, అరటి, పత్తి పంటలు మంచి లాభాలు చేకూర్చుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు చదువుపై ఏమంత శ్రద్ధ ఉండదు. పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు. ఆశించిన ర్యాంకులు రావటం కష్టమే. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది.
విద్యార్థులు సాధించే ఫలితాలపైనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ రాశివారు తరచుగా శుభకార్యాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొనటం వంటి ఫలితాలున్నాయి. వేడుకల్లో మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోండి.
అసాంఘిక కార్యకలాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం. చేనేత, నూలు, పట్టు వస్త్ర వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం అందుతుంది. కళ, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరం. స్త్రీలు అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు.
వీరికి కుటుంబ, ఆత్మీయుల పరంగా మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశివారికి విదేశీ, పుణ్యక్షేత్రాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా బాగుండటం, అవకాశాలు కలిసిరావటం, నోటీసులు అందుకోవటం, వివాదాలు పరిష్కారం కావటం, వ్యవహారజయం, ధన, వస్తు, వస్త్రప్రాప్తి వంటి శుభ ఫలితాలున్నాయి.