కర్కాటకం
ఆదాయం-2
వ్యయం-11
రాజపూజ్యం-4
అవమానం- 7
ఈ సంవత్సరం ఈ రాశివారికి పరీక్షా సమయం. ఓర్పుతో శ్రమిస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. వ్యవహార, సంప్రదింపులతో సతమతమవుతారు. అగ్రిమెంట్ల విషయాలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆదాయం పెంచుకునే దిశగా యత్నాలు సాగిస్తారు.
ఆప్తుల సాయంతో కొన్ని అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలు కలిసిరావు. దంపతుల మధ్య తరచు కలహాలు, వెంటనే రాజీపడటం జరుగుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి.
త్వరలో ఇంతకంటే మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించి ఆలోస్తారు. పిల్లల విషయంలో ఆందోళన చెందవద్దు. వారికి మంచి ర్యాంకులు, విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది.
వ్యవసాయపరంగా మెట్టరైతులకు కష్టకాలం. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ఆస్కారం ఉంది. వారికి అందిన సాయం అసంతృప్తి కలిగిస్తుంది. మాగాణి రైతులకు బాగుంటుంది. అధిక దిగుబడి సాధించటంతో పాటు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనంతో కూడిన పదోన్నతి.
ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు సాధించే ఉత్తమ ఫలితాలపై వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్యం పట్ల నిరంతర కృషి ముఖ్యం. పట్టుదలతో శ్రమించి మంచి ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం తక్కువే.
సాఫ్ట్‌వేర్ రంగ విద్యార్థులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా చూస్తే హోల్సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సామాన్యంగా ఉంటుంది. న్యాయ, వైద్య, విద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. న్యాయవాదులు చేపట్టిన కేసుల్లో విజయం సాధిస్తారు. వైద్యరంగాల వారికి శస్త్ర చికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం.
ప్రభుత్వ లెక్చరర్లకు బదిలీతో కూడిన పదోన్నతి. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి. ఔషధ సేవనం, ఆహార నియమాల్లో అలక్ష్యం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరి సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు.
ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, వెండి, బంగారాలు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. బంధుమిత్రలతో సత్సంబంధాలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయిన వారితో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. పూర్వ గురువులు, స్నేహితులను కలుసుకుంటారు.
వాహనం అమర్చుకోవాలనే కోరిక అతికష్టంమ్మీద నెరవేరుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగవకాశం లభిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు, ధార్మిక సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం కొంతమేరకు శుభదాయకంగాను, సమస్యాత్మకంగాను ఫలితాలు ఉండగలవు.