మిథునం
పరాభవ నామ సంవత్సర ఫలితాలు 2026 నుంచి 2027 వరకు
ఆదాయం - 8 వ్యయం-11 రాజపూజ్యం-7 అవమానం-1
మిథునరాశి : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1 2 3 4 పాదములు పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్నింట అపజయం పొందినా మరికొన్నింట మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవహారానుకూలతలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కీలక బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. నిరంతరం శ్రమిస్తుంటారు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు.
మీ శ్రీమతి బంధువర్గం వారితో విభేదాలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సంస్థల స్థాపనలు, గృహనిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు.
సంతానానికి మంచి ఫలితాలున్నాయి. అవివాహితులకు వివాహయోగం. ప్రముఖులతో పరిచయాలు, సోదర వర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాల పట్ల యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి కాగలవు.
లైసెన్సులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యాత్మకమవుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యవసాయపరంగా అకాల వర్షాలు, వరదలు, తుఫానుల వల్ల పంటదిగుబడులు తగ్గుతాయి. మద్దతు ధర లభించటం కష్టమవుతుంది. దళారుల వల్ల మోసపోతారు.
వ్యాపారపరంగా హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరువ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస, సమయపాలన ప్రధానం.
పదోన్నతికి అవకాశం లేదు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ధనప్రలోభాలకు పోవద్దు. కిట్టని వ్యక్తుల వల్ల కొత్త ఇబ్బందులెదరవుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం, బాధ్యతల మార్పు. వీరి పదోన్నతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుంది.
విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమిస్తే అనుకున్న మంచి ర్యాంకులు సాధిస్తారు. సహవిద్యార్థులతో స్నేహంగా మెలిగితే మంచి ఫలితాలుంటాయి. వీరికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం లేదు. అయినప్పటికీ కోరుకున్న విద్యావకావం లభిస్తుంది. ఈ రాశివారికి ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది.
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకోగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అందరితోను కలుపుగోలుగా మెలిగి అనుకున్న లక్ష్యం సాధిస్తారు.
ఆరోగ్య విషయంలో ఏమాత్రం అలక్ష్యం తగదు. వైద్యసేవలు అవసరమవుతాయి. అప్రియమైన వార్తలు వింటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. తోటి ప్రయాణీకులతో మితంగా సంభాషించండి. విదేశీ సందర్శనలకు పాస్ పోర్టు, వీసాలు మంజూరవుతాయి. కళా, క్రీడా పోటీల్లో రాణిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది.