వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1 2 3 4 పాదములు, మృగశిర 1, 2, పాదములు
ఆదాయం- 5 వ్యయం- 14 అవమానం -5 రాజపూజ్యం- 4
వృషభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకం. ఆత్మీయులు, సన్నిహితులతో నిత్యం ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.
పొదుపునకు అవకాశం లేదు. గృహనిర్మాణాలు, కొనుగోలుపై దృష్టి సారిస్తారు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తరచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. ఆహార నియయాలు, ఔషధసేవనంలను క్రమం తప్పకుంటా పాటించండి.
ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. తరచు ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. మీ కృషి ఆలస్యంగానైనా మంచి ఫలితం ఇస్తుంది. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
సంస్థల స్థాపనలకు అనుకూల సమయం. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ధనప్రలోభాలకు గురికావద్దు. కిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకాటానికి గురిచేస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. రిటైర్డు అధికారులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా లభిస్తాయి.
ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. మీ యత్నం తప్పకుండా ఫలిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. చేనేత, నూలు, పట్టు వస్త్రవ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది. చేపట్టిన అన్ని కేసులలోను విజయం సాధిస్తారు.
టెక్నికల్ రంగాల వారికి నిరాశాజనకం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి బాగుంటుంది. దాళ్వా కంటె సార్వాలో అధిక దిగుబడులు సాధిస్తారు.
మిర్చి, కంది, మినుము, ఉల్లి, కూరగాయల పంట దిగుబడులు బాగుంటాయి. మద్దతు ధర ఏమంత సంతృప్తినీయజాలదు. మార్కెట్ రంగాల వారు ఆశించిన లాభాలు గడిస్తారు. కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య తరచు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. సంతానం దూకుడు అదుపు చేయటం శ్రేయస్కరం. తరచు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్తపరిచయాలు, బంధుత్వాలేర్పడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు తగదు.