మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర 1 2 3 4 పాదములు, రేవతి-1 2 3 4 పాదములు
ఆదాయం -14 వ్యయం-11 - రాజపూజ్యం - 7 అవమానం 2
ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకమే. సంకల్పసిద్ధితో అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు, బంధువర్గం వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు మాత్రం పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. విలాసాలకు అతిగా వ్యయం చేస్తారు. అవసరాలకు ఏదో విధంగా ధనం సమకూరుతుంది.
ప్రతి విషయంలోను చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహంలో శుభకార్యాలు, వేడుకలు ఉంటాయి. బంధువర్గం వారు మరింత చేరువవుతారు. దంపతుల మధ్య స్వల్ప కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. మీ ఓర్పు, అంకితభావం శ్రీరామరక్షగా నిలుస్తాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఔషధసేవనం, ఆహార నియమాల్లో క్రమం తప్పవద్దు. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురవుతుంటారు. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. ఈ సంవత్సరంలో స్థిరాస్తి కొనుగోళ్లు, వ్యవహారానుకూలతలు, కార్యసిద్ధి, దైవబలం తోడ్పాటు, వస్త్రప్రాప్తి ఉన్నాయి.
మీ నిర్లక్ష్యం వల్ల గృహంలో చోరీలు జరిగే ఆస్కారం ఉంది. నగదు, వెండి బంగారాలు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యాలు, బంధమిత్రుల రాకపోకలతో గృహం నిత్యం సందడిగా ఉంటుంది.
ఉద్యోగపరంగా ఈ సంవత్సరం విశేష ఫలితాలున్నాయి. సమర్ధతకు గుర్తింపు, అధికారులు మెచ్చుకోవటాలు, నగదు బహుమతులు, స్థానచలనంతో కూడిన పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది.
కష్టమనుకున్న కేసులు సైతం సునాయాసంగా గెలుస్తారు. సంఘంలో పేరుప్రతిష్టలు లభిస్తాయి. వ్యవసాయదారులకు యోగదాయకమే. సకాలంలో పంట రుణాలు చేతికందుతాయి. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఆశించిన మద్దతు ధర లభిస్తుంది. మెట్ట రైతులకు మాత్రం నిరాశాజనకం. సకాలంలో వర్షాలు కురవక పంట దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు.
దళారులు, మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శుభ తరుణం. నూతన వ్యాపారాలు చేపడతారు. బ్యాంకు, ఫైనాన్సు సంస్థల రుణాలు మంజూరవుతాయి. ఆకర్షణీయమైన పథకాలతో విక్రయాలు బాగుంటాయి. ముఖ్యంగా పట్టు, చేనేత, కలంకారీ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
విద్యార్థులకు గురు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు, ఆశించిన ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి విదేశాల్లో అవకాశాలు రావటంతో పాటు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మహోన్నత కాలం. అన్ని రంగాల్లోను వీరు రాణిస్తారు.
వీరి మాటకు విలువ పెరగటంతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. మొత్తం మ్మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం సర్వత్రా యోగకాలం, శుభప్రదమని చెప్పవచ్చు.