కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1 2 3 4 పాదములు, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆదాయం - 2 వ్యయం 8 - రాజపూజ్యం - 4 అవమానం - 2
ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారజయం, అన్నివిధాలా అనుకూలతలున్నాయి. ఏ పని తలపెట్టినా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహంలో అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు పోగలరు. పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా అనుకూలిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు.
మీపై బంధుమిత్రులకు ప్రత్యేకాభిమానం కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. తరచుగా వేడుకలు, విందులకు హాజరవుతుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సొంత గృహం ఏర్పచుకోవాలన్న వాంఛ నెరవేరుతుంది.
శుభకార్యాలకు సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయత్రా అమోదయోగ్యమవుతుంది. సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారి వల్ల సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. పెద్దల జోక్యంతో వివాదాలు పరిష్కారమవుతాయి.
మీ గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలుగదు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగదాయకం. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు, ప్రముఖులను ఆకట్టుకోగలుగుతారు. వీరికి దూరప్రాంతానికి స్థానచలనం, పదోన్నతి, నగదు బహుమతి వంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు.
సహోద్యోగులతో చిన్న చిన్న సమస్యలెదురైనా వెంటనే సమసిపోగలవు. విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్యసాధనకు మరింత కృషి ముఖ్యం. పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు పొందగల్గుతారు. వీరికి ఇంజనీరింగ్, మెడికల్, లా, సాంకేతిక కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. వీరు అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవటం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. వ్యవసాయ తోటల రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది.
అధిక పంట దిగుబడులు సాధించటంతో పాటు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. వరి, చెరకు, పత్తి, అరటి, పూల, కూరగాయల రైతులకు ఆశాజనకం. దళారుల మాటలు నమ్మి మోసపోకండి. పంటకు మంచి ధర లభించే వరకు వేచియుండండి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
వీరికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా సాయం అందుతుంది. బ్యాంకు, ఫైనాన్సు రంగాల్లో రుణలు అతికష్టంమ్మీద లభిస్తాయి. కళాకారులకు ప్రథమార్ధం వరకు బాగున్నా ఆ తరువాత నిరాశాజనకం. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. మీలోని ప్రతిభకు ఏమాత్రం గుర్తింపు ఉండదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సంవత్సరం శుభకాలం. చేపట్టిన నిర్మాణాలు అనుకున్న సమయంలో పూర్తికావటం, ఫ్లాట్లు త్వరితగతిన అమ్ముడు పోవటం వంటి ఫలితాలున్నాయి. అయితే ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో మాత్రం ఇబ్బందులు తప్పవు. రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కలిసివస్తుంది. మీ పేరిట ఆస్తులు సమకూరుతాయి.
సంతానసౌఖ్యం, గృహంలో ప్రశాంతత పొందుతారు.. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. గృహంలో సైతం వీరి మాట చెల్లుబాటవుతుంది. తరచుగా వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, వెండి బంగారాలు చోరీకి గురయ్యే ఆస్కారం ఉంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుంది.