మకరం
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం 1,2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు
ఆదాయం - 2 వ్యయం 8, రాజపూజ్యం - 1 అవమానం - 6
ఈ రాశివారి గోచారం పరిశీలించగా అన్ని రంగాల వారికీ ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి.
వ్యవహారానుకూలత, కార్యసిద్ధి ఉన్నాయి. లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. ఇతరుల కోసం ధనం విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపు మూలక ధనం అందుకుంటారు.
పెట్టుబడులు కలిసిరావు. మీ శ్రీమతి లేక శ్రీవారి బంధువర్గంతో సంబంధాలు బలపడతాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆసక్తి కలిగించిన సంబంధం నిశ్చయమవుతుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. ఆత్మీయులతో తరచుగా కాలక్షేపం చేస్తారు. సొంతంగా గృహం అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
అందుకు తగ్గట్టుగా యత్నాలు సాగిస్తారు. బ్యాంకు, ఇతరత్రా రుణాలు మంజూరవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికిఉద్యోగావకాశం లభిస్తుంది. చిన్ననాటి గురువులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. విద్యార్థులకు చదువులపై శ్రద్ధలోపిస్తుంది. ఇతర వ్యాపకాలతో కాలం గడుపుతారు.
పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటం కష్టమే. ఏకాగ్రతతో శ్రమిస్తే మంచి ఫలితాలు, ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. నగదు బహమతి, ప్రమోషన్లు పొందుతారు. అధికారులు సైతం వీరి ఉన్నతికి సహకరిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. అనుక్షణం యాజమానుల కోపతాపాలకు గురవుతుంటారు.
ఈ సంవత్సరం చివరిలో వీరికి స్థానమార్పు, ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వీరి ప్రతిభకు తగిన అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మొదటి పంట కంటే రెండవ పంట అధిక దిగుబడి ఇస్తుంది.
పంటలకు తగిన మద్దతు ధర కూడా లభిస్తుంది. దళారుల వలలో పడకుండా కొంత ఆలస్యంగానైనా మంచి ధర కోసం వేచియుండటం శ్రేయస్కరం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. నూతన ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహం. సత్వరం రుణాలు మంజూరవుతాయి.
ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలకు గురైనా వెంటనే తగ్గిపోగలవు. ఈ రాశివారు తరుచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వీరి ఇంట శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడటంతో పాటు సోదర వర్గం బంధువులతో విభేదాలు సమసిపోగలవు.
యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలు, పుణ్యనదీ స్నానాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది.