కొద్ది రోజులుగా కర్నాటకను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కుమారస్వామిని ఇరుకునపెట్టేలా ట్యాపింగ్ కేసుల దర్యాప్తును కేంద్ర ఏజెన్సీ సీబీఐకి అప్పగించనున్నట్లు సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారమే సీబీఐకి లెటర్ రాస్తానని చెప్పారు.
కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో పొలికల్ క్రైసిస్ తలెత్తిన సందర్భంలో నాటి సీఎం కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు, ఇంకొందరు అధికారుల ఫోన్లు ట్యాప్ చేయించారనే ఆరోపణలొచ్చాయి. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి, రాజీనామాలు వెనక్కి తీసుకోకుంటే ఆడియో క్లిప్స్ బయటపెడతానని కుమారస్వామి బెదిరించినట్లు రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఏహెచ్ విశ్వనాథ్(జేడీఎస్) ఆరోపించారు.
బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ఓ అధికారితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా సంచలనం రేపింది. ఫోన్ ట్యాపింగ్స్పై సీబీఐ ఎంక్వైరీని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే గతంలోలా సీబీఐని బీజేపీ తన సొంతానికి వాడుకోవద్దని, వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని బీజేపీలోకి చేర్చుకున్న 'ఆపరేషన్ కమల్'పైనా విచారణ చేయించాలని కాంగ్రెస్ లీడర్ సిద్దరామయ్య కోరారు.
కాగా, ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధంలేదని, కొన్ని లోకల్ టీవీ చానెల్స్ పనిగట్టుకుని ప్రాపగండా చేశాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. 'సీబీఐతో కాకుంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీతోనైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిర్యాదుచేసి, ఆయన తరఫున ఎవరితోనైనా దర్యాప్తు చేయించినా ఫర్వాలేదు' అని కుమారస్వామి మండిపడ్డారు.