Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటక అసెంబ్లీ: వీగిన విశ్వాసం.. కూలిన కుమారస్వామి ప్రభుత్వం

Advertiesment
Karnataka Assembly Floor Test
, మంగళవారం, 23 జులై 2019 (20:08 IST)
కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసింది. ఓటింగ్ జరిగింది. స్పీకర్ రమేశ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని కాపాడేందుకుగాను తాను ఓటింగ్‌లో పాల్గొనడం లేదని రమేశ్ వెల్లడించారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు ఎవరెవరు.. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న వారు ఎవరు? అని స్పీకర్ ఒక్కో వరుసలో ఉన్న ఎమ్మెల్యేలను అడిగారు.

 
అసెంబ్లీ అధికారులు ఒక్కో వరుస వద్దకు వెళ్లి.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారిని వేరుగా, వ్యతిరేకంగా ఉన్నవారిని వేరుగా లెక్కించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయని స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆరు ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది.

 
‘ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేందుకు సిద్ధం’ - కుమారస్వామి
నాలుగు రోజులపాటు జరిగిన ఈ బల నిరూపణ చర్చకు మంగళవారం సాయంత్రం కుమారస్వామి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ (ముఖ్యమంత్రి) పదవిని సంతోషంగా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పారు. విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ను మరింత కాలం పాటు పొడిగించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. అలాగే స్పీకర్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

 
తాను ఎందుకు రాజీనామా చేయనిది, ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగుతోంది కూడా ఆయన వివరణ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని ఆయన చెప్పారు.

 
‘ఎమ్మెల్యేలను ‘హోల్‌సేల్’గా కొనుగోలు చేసిన బీజేపీ’ - సిద్ధరామయ్య ఆరోపణ
కాగా, ఈ విశ్వాస తీర్మానం చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేలను ‘హోల్‌సేల్‌’గా కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రపై ఇదొక మాయనిమచ్చ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వెనుక ఉన్నది బీజేపీయే అన్న సంగతి 99 శాతం మంది ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.

 
కాంగ్రెస్ జారీ చేసిన విప్‌కు విలువ లేదు - యడ్యూరప్ప
అంతకు ముందు బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకు జారీ చేసిన విప్‌కు ఎలాంటి విలువ లేదని చెప్పారు.
 
‘‘(రెబల్) ఎమ్మెల్యేలకు విప్ నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇప్పింది. వాళ్లు అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదు. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మీరు జారీ చేసిన విప్‌కు విలువ లేదు’’ అని యడ్యూరప్ప చెప్పారు. ఈ అంశంపై కొద్దిసేపు బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య సభలో వాదోపవాదాలు జరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సభను నడపాల్సింది స్పీకరా? ముఖ్యమంత్రా?.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక‌ట్రావు