Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిదంబరంకు ఝులక్ ఇచ్చిన సుప్రీంకోర్టు .. అరెస్టు కోసం వేట

చిదంబరంకు ఝులక్ ఇచ్చిన సుప్రీంకోర్టు .. అరెస్టు కోసం వేట
, బుధవారం, 21 ఆగస్టు 2019 (17:38 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సుప్రీంకోర్టు ఝులక్ ఇచ్చింది. కోర్టు లిస్టులోకి పిటిషన్ వచ్చేంతవరకు దానిగురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు, చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీలు వేట కొనసాగిస్తున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్టు కోసం ఈడీ, సీబీఐ అధికారులు ప్రయత్నించగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ముందస్తు బెయిల్ కోసం చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇందుకోసం ఓ పిటిషన్‌ను రిజిస్ట్రార్‌కు అందజేశారు. అయితే, పిటిష‌న్‌లో లోపాలు ఉన్న‌ట్లు సుప్రీం గుర్తించింది. త‌ప్పులు లేకుండా మ‌రోసారి పిటిష‌న్ వేయాల‌ని చిదంబ‌రానికి చెందిన న్యాయ‌వాదుల‌ బృందానికి కోర్టు చెప్పింది. 
 
మరోవైపు, లుకౌట్ నోటీసులు ఇవ్వ‌డం వ‌ల్ల చిదంబ‌రం ఇప్పుడు దేశం విడిచి వెళ్లే ప్ర‌స‌క్తే లేదు. బెయిల్ కావాల‌ని ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించినా.. ఆయ‌న‌కు అక్క‌డ ఊర‌ట ద‌క్క‌లేదు. చిదంబ‌రం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ కొట్టిపారేశారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ బృందం న్యాయమూర్తిని ఎంత వేడుకున్నా ఆయ‌న విన‌లేదు. 
 
అర్జెంట్‌గా కేసును స్వీక‌రించాల‌ని సిబ‌ల్ టీమ్ కోర్టును కోరింది. కానీ ఆ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించారు. చిదంబ‌రానికి ఊర‌ట ఇవ్వాల‌ని, ఒక‌వేళ ఆయ‌న్ను అరెస్టు చేస్తే, అప్పుడు ముంద‌స్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిష‌న్ వ్య‌ర్థ‌మ‌వుతుంద‌ని న్యాయ‌వాది సిబ‌ల్ కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు కనికరించలేదు. దీంతో చిదంబరం అరెస్టు తప్పేలా లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు... అమిత్ షా ప్రతీకారమా?