ఐఎన్ఎక్స్ కేసులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం అరెస్టుకు సీబీఐతో పాటు.. ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్టు తథ్యంగా కనిపిస్తోంది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. చిదంబరంతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.
దశాబ్దాలుగా దేశానికి చిదంబరం సేవ చేశారని... కేంద్ర ఆర్థిక, హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారని చెప్పారు. నిజాలను నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమని... కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారని అన్నారు. కొందరు పిరికిపందల వల్ల నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక విమర్శించారు. ఆయనకు తామంతా మద్దతుగా నిలుస్తామని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరబోమని... న్యాయం కోసం పోరాడుతామని ప్రియాంకా గాంధీ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.