కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా కేసు చుట్టుకుంది. ఈ కేసులో ఆయన అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. పైగా, మంగళవారం రాత్రి నుంచి చిదంబరం కనిపించడం లేదు. దీంతో ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది.
అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను ప్రధాన నిందితుడుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. పైగా, ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఆదేశిస్తూ, ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీని వెనుక ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా నిర్ధారిస్తున్నాయి. దీనికి వెనుక బలమైన కారణం లేకపోలేదు.
గతంలో యూపీఏ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఆ సమయంలో కేంద్ర హోంమంత్రిగా పి. చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. ఈయన్ను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి.. జైల్లో వేయించారు.
ముఖ్యంగా సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో అమిత్ షా హస్తముందని ఆరోపణలు వచ్చాయి. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్‌ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనమే. ఈ కేసులో అమిత్ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తర్వాత ఆయనకు గుజరాత్ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు.
ప్రస్తుతం కాలం మారిపోయింది. యూపీఏ అధికారం కోల్పోయింది. ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. తొలి ఐదేళ్ళ పాటు కేంద్ర హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఉంటే, ప్రస్తుతం అమిత్ షా ఉన్నారు. ఇపుడు ఈయన ప్రతీకార చర్యలకు పూనుకున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏదిఏమైనా పి.చిదంబరం అరెస్టు తథ్యంగా కనిపిస్తోంది.