శ్రావణమాసం కదా, ఏ తెలుగింట్లో చూసినా వాయనాలుగా ఇచ్చిపుచ్చుకునే సెనగలు కనిపిస్తూనే ఉంటాయి మనకు. ఇలా పండగలప్పుడు మాత్రమే కనిపించే సెనగలని ఉత్తరాదిన రోజువారీ ఆహారంగా వండుకుంటారు. వీటిల్లోని పోషక విలువలు తెలిస్తే, మీరూ ఏడాదంతా వండుకుంటారు.
బరువు తగ్గలనుకునే వారికి: వీటిల్లో కెలొరీలు తక్కువ. పీచు, ఇతరత్రా పోషకాలు అపారం. ఆ కారణంగానే ఉదయం పూట రెండుమూడు చెంచాల సెనగలు తిన్నా, రోజుకు అవసరమైన కాయగూరలు, పండ్లలో ఐదోవంతు తిన్నట్టే. అంతేకాదు, సెనగలు తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి బయట తిండి తినాలనే కోరిక తగ్గుతుంది. దాంతో బరువు అదుపులో ఉంటుంది.
శాకాహారుల మాంసం: ప్రోటీన్లు అందాలంటే మాంసాహారం తినాల్సిందే, అనే అపోహకు చెక్ పెడతాయి సెనగలు. కారణం, ఇవి శరీరానికి కావాల్సిన ప్రోటీన్లని పుష్కలంగా అందిస్తాయి.
మహిళలకు ప్రత్యేకం: వారంలో కనీసం రెండుమూడుసార్లైనా కొమ్ముసెనగలని తింటూ ఉండే మహిళల్లో రొమ్ముక్యాన్సర్, కీళ్ల నొప్పుల వంటివి అదుపులో ఉంటాయట. వేయించిన సెనగలని, నెయ్యి, పంచదారతో కలిపితింటే జననాంగ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.