Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ వ్యాక్సిన్లతో నపుంసకత్వం వస్తుందా? డీసీజీఐ చీఫ్ ఏమంటున్నారు?

కోవిడ్ వ్యాక్సిన్లతో నపుంసకత్వం వస్తుందా? డీసీజీఐ చీఫ్ ఏమంటున్నారు?
, ఆదివారం, 3 జనవరి 2021 (20:39 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేశాయి. వీటిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇపుడు సిద్ధంగా ఉండగా, ఈ వ్యాక్సినేషన్ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కూడా అనుమతి ఇచ్చింది. దీంతో భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ఎంపిక చేసిన రాష్ట్రాల్లో డ్రై రన్ కూడా నిర్వహించారు. ఇపుడు  ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత్ సిద్ధమవుతోంది. అదేసమయంలో వ్యాక్సిన్లు వేయించుకుంటే అనేక దుష్ప్రరిణామాలు కలుగుతున్నాయనే వదంతులు వస్తున్నాయి. ముఖ్యంగా, నపుంసకత్వం సంభవిస్తుందని ఓ ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై డీసీజీఐ చీఫ్ వీజీ సోమని స్పందించారు. భద్రత పరంగా కనీసం అత్యంత సూక్ష్మమైన ఆందోళనకరమైన అంశం ఉన్నా తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం తెలపబోమన్నారు. కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు నూటికి 110 శాతం సురక్షితమైనవని స్పష్టం చేశారు. 
 
ఏ వ్యాక్సిన్‌కైనా స్వల్ప జ్వరం, నొప్పి, అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సాధారణ విషయమేనని చెప్పారు. వ్యాక్సినేషన్ వల్ల నపుంసకత్వం వస్తుందని జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అర్థరహితమన్నారు. ఈ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు. 
 
తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించాలని సీడీఎస్‌సీవో (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నిర్ణయించిందన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించినట్లు తెలిపారు. అలాగే, క్యాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన వ్యాక్సిన్‌ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 
 
మరోవైపు, కోవిడ్ వ్యాక్సిన్లపై వదంతుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలను డిసెంబరు 31న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరిన సంగతి తెలిసిందే. సందేశాలను సరిచూసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని కోరారు. భారతదేశం కోవిడ్ రహితం కాబోతోందని, రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరైన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలను పక్కనబెట్టి కోవాగ్జిన్‌ అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యూజియంలు మారనున్న బాలీవుడ్ నట దిగ్గజ నివాసాలు!