పాకిస్తాన్ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో నట దిగ్గజాలుగా ఖ్యాతిగడించిన వెటర్న్ హీరోలు దిలీప్ కుమార్, రాజ్‌కుమార్ నివాసాలను మ్యూజియంలుగా మార్చాలని నిర్ణయించింది.
భారతదేశ విభజనకు పూర్వం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఈ ఇద్దరు జన్మించారు. పైగా, వారి కుటుంబ సభ్యులకు చెందిన భవనాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.
ఇపుడు ఈ భవనాలను వాటిని మ్యూజియంలుగా మార్చాలని స్థానిక ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనాలను కొనుగోలు చేసేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది.
దీనిపై ఖైబర్ పఖ్తుంక్వా ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు కమ్రాన్ బంగాష్ మాట్లాడుతూ, పెషావర్‌లోని దిలీప్ కుమార్ నివాసం, రాజ్ కుమార్‌కు చెందిన భవంతిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేశారని, వాటిని మ్యూజియంలుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
దేశవిభజనకు పూర్వం ఉన్న సంస్కృతిని పునరుజ్జీవింప చేయడం, పెద్దసంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెల్సిందే.