ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి. దీంతోపాటు కోవిషీల్డ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్ల అత్యసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
ఆ రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో ఇటీవలే సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు డీసీజీఐ ప్రకటించింది. వ్యాక్సిన భద్రత, సమర్థలపై సీరం సంస్థ పూర్తి వివరాలు సమర్పించిందని చెప్పింది.
ఐసీఎంఆర్, ఎన్ఐవీతో కలిసి భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ను తయారు చేసిందని వివరించింది. కొవాగ్జిన్ సురక్షితమని ఇప్పటికే నిర్ధారణ అయిందని చెప్పింది. తొలి రెండు దశల్లో మొత్తం 800 మందిపై కొవాగ్జిన్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని డీసీజీఐ చెప్పింది.
అలాగే, మూడో దశలో 25,800 మంది వాలంటీర్లకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చారని వివరించింది. ఇప్పటికే ఆయా వ్యాక్సిన్లకు సంబంధించిన కోట్లాది డోసులను అభివృద్ధి చేశారు. మొదటి దశ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మూడు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్లు వేయనున్నారు.
ఇప్పటికే డ్రైరన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారులు వ్యాక్సిన్ పంపిణీపై శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జులై నాటికి దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించనున్నారు.
కాగా, భారత్‍లో సీరం తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఇటీవల పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. కొవ్యాగ్జిన్‌ను భారత్ బయోటెక్ ఇండియాలో అభివృద్ధి చేసింది.
ఇదిలావుండగా, కరోనా వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితమైనవే అని డీసీజీఐ వీజీ సోమానీ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ల వల్ల స్వల్పంగా అయినా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అనుకుంటే తాను అనుమతి ఇచ్చేవాడినే కాదని ఆయన అన్నారు.
ఏ వ్యాక్సిన్‌తో అయినా కాస్త జ్వరం, నొప్పి, అలెర్జీ వంటి సమస్యలు సాధారణమే అని సోమానీ చెప్పారు. ఇక వ్యాక్సిన్ వల్ల నపుంసకులుగా మారుతారని వస్తున్న పుకార్లని ఆయన కొట్టి పారేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
ఇండియాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లను పరిమిత స్థాయిలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించిన విషయ తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్‌లను రెండు డోసులుగా ఇవ్వనున్నారు.