చిత్రం : ప్రతి రోజూ పండగే
నిర్మాణ సంస్థ : జీఏ 2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్
తారాగణం : సాయితేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, కృష్ణమాచారి తదితరులు.
దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీవాస్
మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్. చిత్రలహరి చిత్రం సక్సెస్ తర్వాత నటించిన చిత్రం "ప్రతిరోజూ పండగే", అందమైన కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు వంటి ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి హిట్ కోసం వేచి చూస్తున్న దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంది? అసలు దర్శకుడు మారుతి ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడు? చిత్రలహరి తర్వాత సాయితేజ్‌కి ఈ సినిమాతో మరో సక్సెస్ దక్కిందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
కథ: ఓ పల్లెటూరులో రఘురామయ్య(సత్యరాజ్)కి ముగ్గురు కుమార్తెలు, ఓ కూతురు ఉంటుంది. అందులో ఇద్దరు కొడుకులు, కుమార్తె విదేశాల్లో నివశిస్తుంటారు. చిన్న కొడుకు మాత్రం పక్కనున్న సిటీలో ఉండి క్యాటరింగ్ బిజినెస్ వ్యాపారంలో బిజీగా ఉంటాడు. అయితే, రఘురామయ్యకి ఊపిరితిత్తుల కేన్సర్ ఉందని డాక్టర్ ధృవీకరిస్తారు.. ఐదు వారాల కంటే ఎక్కువగా జీవించే అవకాశం లేదని వైద్యులు చెబుతారు. ఈ విషయాన్ని తన పిల్లల దృష్టికి తీసుకెళతారు. ఐదు వారాలు ఊర్లో ఉండటం కంటే చివరి రెండు వారాలు ఊరికి వెళదామని అందరూ అనుకుంటారు. ఈ విషయం తెలిసిన పెద్ద మనవడు సాయి(సాయితేజ్) అమెరికా నుంచి తాతయ్య దగ్గరకి వచ్చేస్తాడు.
తాతయ్య కోరిక ప్రకారం ఆయన స్నేహితుడు సత్యనారాయణ(విజయ్‌కుమార్) మనవరాలు ఎంజెల్ అర్నా(రాశీఖన్నా)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వారి కుటుంబ సభ్యులను కూడా ఒప్పిస్తాడు. అదేసమయంలో సాయి తండ్రి (రావు రమేష్).. బిజినెస్ కోసం ఓ పెళ్లి సంబంధం చూస్తాడు. కానీ తీరా కొడుకు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి స్వదేశానికి వచ్చేస్తాడు. అతనితో పాటు ఇతర తమ్ముళ్లు, చెల్లెలు కూడా వచ్చేస్తారు. రఘురామయ్య అందరితో సంతోషంగా ఉంటాడు.
ఈ క్రమంలో అనుకోని నిజం ఒకటి తెలుస్తుంది? ఆ నిజమేంటి? నిజంగానే రఘురామయ్యకి కేన్సర్ ఉంటుందా? ఆయన చనిపోతాడా? లేదా? కేవలం పని, డబ్బు గురించి మాత్రమే ఆలోచించే రఘురామయ్య కొడుకుల్లో సాయి ఎలాంటి మార్పు తెస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేపథ్యాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. కథానుగుణంగా ఆయన ఎంచుకున్న పాత్రలు, వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఎక్కడా పక్కకు పోనీయకుండా జాగ్రత్తపడ్డాడు. అలాగే హీరో చుట్టూనే కథను తిప్పాలనుకునే దర్శకుడిగా ఆలోచించకుండా.. ఏం చెప్పాలనుకున్నాడనే పాయింట్ చుట్టూనే కథను రన్ చేయించాడు. వాటి ఆధారంగా పాత్రలను తీరు తెన్నులు ఉండేలా శ్రద్ధ చూపించాడు.
సినిమా ఎక్కువ పాత్రలు ఉన్నప్పటికీ ప్రధానమైన పాత్రధారి సత్యరాజ్ అనే చెప్పాలి. ఆయన పాత్ర చుట్టూనే సినిమా అంతా రన్ అవుతుంది. ఆయన రఘురామయ్య పాత్రలో పరకాయం ప్రవేశం చేశాడు. ఎమోషన్స్‌ను చక్కగా క్యారీ చేశాడు. ఇక సినిమాలో మరో ప్రధానమైన పాత్ర రావు రమేష్. సత్యరాజ్ పాత్ర తర్వాత సినిమా ఆసాంతాన్ని తన భుజాలపై నడిపించిన ఘనత రావు రమేష్‌కే దక్కుతుంది. ఆ పాత్రను రావు రమేష్ తప్ప మరొకరు చేయలేరు అనేలా ఉంది. విదేశాల్లో ఉన్న కొడుకు తండ్రి చనిపోతాడని భారత్ వచ్చినప్పుడు, ఆ పాత్ర ప్రవర్తించే తీరు, దాని చుట్టూ అల్లిన కామెడీని రావు రమేష్ అద్భుతంగా చేశాడు.
ఇకపోతే, సాయితేజ్ ఉన్నప్పటికీ రఘురామయ్య పాత్రధారిగా నటించిన సత్యరాజ్ చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఈ పాత్రకు సపోర్టింగ్‌గా ఉండే పాత్రలాంటి పాత్రలో సాయితేజ్ నటించాడు. ఇలాంటి పాత్రలో నటించడానికి అంగీకరించిన సాయితేజ్‌ని అభినందించాలి. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. హీరోయిజం కోసం పెట్టిన రెండు ఫైట్స్‌లో ఓ ఫైట్‌లో సాయితేజ డెడికేషన్‌తో 6 ప్యాక్‌తో కనపడటం అభినందనీయం. ఇక ఏంజెల్ అర్ణ పాత్రలో రాశీఖన్నా ఇమిడిపోయింది. అయితే సెకండాఫ్‌లో ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనపడదు. హరితేజ, ప్రవీణ్, అజయ్, సత్యం రాజేష్, విజయ్ కుమార్, భరత్ రెడ్డి, ప్రభ ఇలా అందరూ వారి వారి పరిధుల మేర చక్కగా నటించారు.
ఇక దర్శకుడు పనితీరు చెప్పుకోదగిన విధంగా ఉంది. ఎక్కడా ఎక్కువ నాటకీయత లేకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. అయితే అన్నిచోట్ల ఎమోషన్స్ సరిగ్గా పండించలేకపోయాడు. అలాగే సినిమా కథలో కొత్తదనమేమీ లేదు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చూపే సంతానం కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుందనే పాయింట్‌ను బేస్ చేసుకుని మారుతి సినిమాను తీశాడని చెప్పొచ్చు.
తమన్ సంగీతంలో బావ సాంగ్, కొట్టర డీజే సాంగ్స్ బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. జయకుమార్ కెమెరా పనితనం బావుంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బావుంది. మొత్తంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులు సినిమా ఆసాంతం ఓ ఎమోషన్ రన్ అవుతున్నా.. నవ్వుకుంటూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఈ చిత్రం ప్లస్ పాయింట్స్‌ను పరిశీలిస్తే, పాత్రల తీరు తెన్నులు, కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంది. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, కథలో కొత్తదనం లేకపోవడం, రెండో భాగం కాస్తంత సాగదీతతో కనిపిస్తుంది. మొత్తంమీద ఈ చిత్రం మంచి కుటుంబ కథా చిత్రంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.