దేశ ఆటోమొబైల్ రంగం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. ఫలితంగా వాహనాల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. నోట్ల రద్దుతో పాటు.. జీఎస్టీ పన్ను అమలుతో ఆటోమొబైల్ రంగం కుదేలైంది. దీంతో పలు కార్ల ఉత్పత్తి కంపెనీలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో దేశంలో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన కొత్త రకం వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో వాటిని విక్రయించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, లక్ష రూపాయల వరకు తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. డీజిల్ రకం వాహనాలపై మంచి ఆఫర్లను ప్రకటించారు. ఈ సదావకాశం సెప్టెంబరు 30వ తేదీ వరకు ఉండనుంది.
మారుతి తయారు చేసిన కొత్త రకం కారు మారుతి బ్రెజ్జా. ఈ కార్ల విక్రయాలు బాగా తగ్గిపోయి, ఇటీవలే కాస్త పుంజుకుంటున్నాయి. ఆగస్టు నెల గణాంకాలను పరిశీలిస్తే, 34.08 శాతం విక్రయాలు పెరిగాయి. గతంతో పోల్చితే ఈ గణాంకాలు బాగున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో బ్రెజ్జా విక్రయాలను మరింతగా పెంచేందుకు వీలుగా ఈ రకం కార్లపై 1.01 లక్షల రూపాయల వరకు తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించారు.
ఇందులో రూ.50 వేలు డిస్కౌట్ కాగా, రూ.20 వేల వరకు ఎక్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.10 వేలు ఇస్తున్నారు. అలాగే, ఐదేళ్ళ వారంటీ కూడా ఇస్తున్నారు. అలాగే, మారుతి డిజైర్, మారుతి స్విఫ్ట్, మారుతి ఆల్టో, ఆల్టో కె10, మారుతి సెలీరియో, మారుతి ఎకో తదితర మోడల్స్‌పై కూడా భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది.