టెక్నాలజీ పెరిగినా మూఢనమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చినా.. దొంగ బాబాల వెనుక పరుగులు తీసే జనం అధికమవుతూ వున్నారు. తాజాగా ఓ దొంగబాబా చేతికి ఓ మహిళ చిక్కుకుంది.
సర్పదోషం వుందని పూజ చేయాలని ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించిన బాబా బాగోతం బయటపడింది. సర్పదోషం పేరిట మహిళను లోబరుచుకోవాలనుకున్న ఈ ఇద్దరు బాబాలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉండే ఓ మహిళ బాణసవాడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గొడవల కారణంగా భర్తతో విడిపోయిన ఆమెకు సర్పదోషం ఉందని ఇటీవల ఎవరో చెప్పారు.
దాంతో సర్పదోష నివారణ కోసం పరిచయస్తుడైన జగన్నాథ్‌ను సంప్రదించింది. కామస్వామి గణేష్, మణికంఠ అనే ఇద్దరు స్వాములను జగన్నాథ్ పరిచయం చేశాడు. వీరిద్దరు తండ్రీకొడుకులు సర్ప దోష నివారణకు పూజ చేయాలని చెప్పి రూ.40వేలు వసూలు చేశారు.
పూజ అనంతరం మరో ప్రక్రియ ఉందని చెప్పి.. తమతో ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించారు. ఇందుకోసం ఓ హోటల్‌లో గదులు కూడా బుక్ చేశారు. ఇంతలోనే విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.