దేశ ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని నిజం చేసేలా, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కార్ల కంపెనీ డీలర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె పేరు రీటా లంకలింగం. వయసు యాభై యేళ్లు. లాన్సన్ టయోటా కార్ల కంపెనీ డీలర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలో కార్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయిన విషయం తెల్సిందే. దీంతో అనేక కార్ల కంపెనీలతో పాటు.. డీలర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. కొన్ని కార్ల కంపెనీలు అయితే కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి.
ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన లాన్సన్ టయోటా కార్ల డీలర్ షిప్‌తో పాటు. ఆ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న రీటా ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు రావడంవల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
స్థానిక నుంగంబాక్కం కొథారీరోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. లంక లింగం తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కంపెనీ శాఖలను విస్తరింపజేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నివాసానికి చేరుకున్న రీటా తన గదిలో నిద్రపోయారు. గురువారం ఉదయం 11 గంటల వరకు ఆమె గది నుంచి వెలుపలికి రాకపోవడం, గదిలో ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో పనిమనిషి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా రీటా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. భర్తతో ఆమెకు గొడవలున్నాయా? లేక కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు ఏర్పడడంతో దిగులు చెంది ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.