ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వనపర్తి వెంకటయ్య నిర్మించిన చిత్రం ఊరికి ఉత్తరాన. దిల్ రాజు సంస్థతో పాటు కోన వెంకట్, వేణు శ్రీరామ్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సతీష్ పరమవేద దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంతో నరేన్ హీరోగా పరిచయం కాగా, దీపాలి హీరోయిన్‌గా నటించారు. రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ ప్రధాన పాత్రలు పోషించారు.
వరంగల్‌లో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. తెలంగాణ. గ్రామీణ జీవితం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు నేపథ్యంలో మరోసారి కొత్తగా వచ్చిన ఊరికి ఉత్తరాన ఈరోజే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
కథ:
వరంగల్ లోని ఓ గ్రామంలో శంకర్ పటేల్ (రామరాజు) గ్రామ పెద్ద. ఆయన ఏం చెబితే అదే శాసనం. ప్రేమ వివాహలు గిట్టదు. ఊళ్ళోవారు పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకోవాలని రూల్ చేస్తాడు. ధిక్కరిస్తే శిక్ష దారుణంగా వుంటుంది. మరోవైపు ఆయన మేనకోడులు శైలు (దీపాలి శర్మ) ప్రేమలో పడుతుంది. అది కూడా తన గ్రామానికే చెందిన కరెంట్ రాజు (నరేన్)తోనే. ఓసారి చార్మినార్ చూపించమని అడుగుతుంది. అలా ఇద్దరూ రైలు ప్రయాణం సాగిస్తుండగా రాజు నిద్రపోతాడు. ఇదే అదనుగా శైలు మధ్యలో దిగిపోతుంది. అది తెలియని రాజు కంగారుపడిపోతూ అంతా వెతుకుతాడు. ఓ చోట సొమ్మసిల్లి పడిన శైలును చూస్తాడు. అసలు ఆమె ఎందుకు అలా దిగింది? సొమ్మసిల్లి పడిపోవడానికి కారణం ఏమిటి? చివరికి రాజు, శైలు వాళ్ళ ఊరు వెళితే శంకర్ పటేల్ ఎటువంటి శిక్ష విధించాడు? అన్నది తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.
విశ్లేషణః
చక్కటి పాయింట్‌ను సినిమాటిక్‌గా దర్శకుడు తీసి మెప్పించాడు. ఊరిలో కట్టుబాట్లు, సంప్రదాయాలు నేపథ్యంని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ దర్శకుడు చేసిన ప్రయత్నం ఇది. జరిగిన కథ కాబట్టి వాస్తవంగా చూపించే ప్రయత్నం చేశారు. హీరో హీరోయిన్లు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. గెడ్డం పెంచి మొరటుగా అనిపించినా పాత్రకు తగిన న్యాయం చేశాడనే చెప్పాలి. ఎక్కువ భాగం ఎంటర్‌టైన్‌మెంట్ దిశగా తీసుకెళ్ళారు. దాంతో పెద్దగా బోర్ అనిపించదు. దీపాలి శర్మ గ్రామీణ యువతి పాత్రలో ఆకట్టుకుంది. గ్రామ పెద్దగా శంకర్ పటేల్ పాత్రలో రామరాజు ఎప్పటిలాగే అలరించారు. కట్టుబాట్లను అతిక్రమించిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదనే గ్రామ పెద్ద పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ ఫణి, ఆనంద్ చక్రపాణి, జగదీష్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
కొత్తవారు కాబట్టి ఎక్కడైనా గాడితప్పుతుందేమోనని ఊహించడానికి ఆస్కారం లేకుండా పంచ్‌డైలాగ్ సంభాషణలతో మరిపించాడు. కథనంలో చిన్నపాటి లోపాలున్నా వీరి నటనతో అవేవీ కనిపించలేదనే చెప్పాలి. భీమ్స్ సంగీతం సందర్భానుసారంగా చేశాడు. పాటలు బాగున్నాయి. పల్లెటూరి అందాలతో సినిమాటోగ్రఫీ బంధించాడు.
సినిమా రంగం ఆరంభంలో నిర్మాతలు వ్యవసాయ రంగం నుంచి వచ్చేవారు. నేడు అలాంటివారు కానరారు. కానీ ఈ సినిమాతో రైతు తన కొడుకును నటుడిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. పరిమిత బడ్జెట్‌లో వనపర్తి వెంకటయ్య , రాచాల యుగంధర్ నిర్మించిన నిర్మాణపు విలువలు బాగున్నాయి.