Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినూత్నంగా సాగే - మిస్సింగ్‌- రివ్యూ రిపోర్ట్‌

వినూత్నంగా సాగే - మిస్సింగ్‌- రివ్యూ రిపోర్ట్‌
, శుక్రవారం, 19 నవంబరు 2021 (11:47 IST)
Missing still
నటీనటులు :- హర్ష నర్రా (గౌతమ్), నిక్కిషా (శృతి), మిషా నారంగ్ (మీనా), చత్రపతి’ శేఖర్ (C.I కిరణ్), రామ్ దత్ (ACP త్యాగి), సూర్య (డా. సూర్య) మరియు ఇతరులను పరిచయం చేస్తున్నారు.
 
సంగీతం :- అజయ్ అరసాడ, ఎడిటర్ :- సత్య జి , DOP :- Janaa Vfx :- ప్రదీప్ పూడి స్టంట్స్:- సీనియర్ సతీష్‌, క‌ళ :- రమేష్ బాబు దార సాహిత్యం :- వసిష్ట శర్మ కిట్టు విస్సాప్రగడ రిని జోస్యుల (M.F.Tech)
కాస్ట్యూమ్ డిజైనర్:- శృతి కిరణ్, ప్రొడక్షన్ డిజైనర్:- దీక్షా రెడ్డి, కో-డైరెక్టర్:- శివ్ జిజి
ప్రొడక్షన్ కంట్రోలర్:- B.C చౌదరి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:- సాయి k కిరణ్ (M.F.Tech)
నిర్మాతలు:- భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా
రచన మరియు దర్శకత్వం:- శ్రీని జోస్యుల (M.F.Tech)
 
ఇప్ప‌టిత‌రం యాక్టింగ్ స్కూల్‌లో నేర్చుకుని త‌ప‌న‌తో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరిస్ చేస్తూ ఆ త‌ర్వాత సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి శ్రీని జోస్యుల, రామానాయుడు ఫిలింస్కూల్‌లో త‌ర్ఫీదు పొంది, మ‌రో స్టూడెంట్, స్నేహితుడు అయిన  కిర‌ణ్ నిర్మాణ‌సార‌థ్యంలో తీసిన సినిమా `‘మిస్సింగ్’. హర్ష నర్రా హీరోగా పరిచయమైన చిత్ర‌మిది. టైటిల్‌లోనే మిస్ట‌రీ దాగివుంద‌ని తెలిసిపోతుంది. అది ఎలా ఏమిటి? అనేది తెర‌పై చూడాలంటున్నారు చిత్ర యూనిట్‌. ఈరోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థః
ప్రేమించి పెండ్లి చేసుకున్న జంట గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నికీషా రంగ్వాలా). కారులో ఓ రోజు షాపింగ్‌కు వెళ్ళి తిరిగి వ‌స్తుండ‌గా యాక్సిడెంట్ జ‌రుగుతుంది. తీవ్రగాయాల పాలైన గౌతమ్ ను హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు. డాక్ట‌ర్ అత‌ని బావే. అదే సమయంలో కారులో ఉన్న శ్రుతి మాత్రం మిస్ అవుతుంది. ఆమెకోసం త‌న బావ‌తోపాటు మ‌రో స్నేహితుడు క‌లిసి వెతికే ప‌నిలో వుంటారు. ఇంకోవైపు ఈ కేసుపైనే నియ‌మించిన పోలీసు అధికారి కూడా వెతుకుతుంటాడు. కానీ ఎవ‌రు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారో?  కూడా తెలీని త‌రుణంలో గౌత‌మ్ ద‌గ్గ‌ర‌కు  ప్రేయ‌సి అంటూ మిషా నారంగ్ తెర‌పైకి వ‌స్తుంది. కానీ ఆమె ఎవ‌రో తెలీదంటాడు గౌత‌మ్‌. ఈ క్ర‌మంలో అస‌లేం జ‌రుగుతుంద‌నేది చూసే ప్రేక్ష‌కుడికి ఆస‌క్తి క‌లుగుతుంది. స‌మాధానం దొర‌కాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణః
 
కొత్త‌వారు స‌హ‌జంగా ప్రేమ‌క‌థ‌ల‌నే ముందుగా ఎంచుకుంటారు. కానీ ఈ చిత్ర టీమ్ వినూత్నం కోసం చేసిన ప్ర‌య‌త‌మే మిస్సింగ్‌. ఓపెనింగ్ షాటే అప‌రిచితుడు సినిమాను త‌న ఫోన్‌లో ఓ అమ్మాయి చూస్తుంటుంది. అదే ముగింపులోకూడా క‌నెక్ట్ అయ్యేలా ద‌ర్శ‌కుడు చూపాడు. ముందుగానే కొంచెం అవ‌గాహ‌న వున్న ప్రేక్ష‌కుడికి ఇది ఒక వ్య‌క్తిలో రెండు కోణాలు వుండే క‌థ అని భ్ర‌మించేలా చేశాడు. ఆ కోణంలో ఆలోచిస్తే ఆ త‌ర్వాత వ‌చ్చే క‌థ‌లోని మలుపులు మ‌రోర‌కంగా అనిపిస్తాయి. ఇలా క‌థ‌కు ఎక్క‌డా అవ‌స‌ర‌మే అక్క‌డ కొన్ని ట్విస్ట్‌ల‌తో ద‌ర్శ‌కుడు ముందుకు తీసుకెళ్ళాడు.
 
భార్య మిస్సింగ్‌, భ‌ర్త‌పైనే డౌట్ అనేలా కొన్ని క‌థ‌లు వ‌చ్చేశాయి. కానీ డైరెక్టర్ తెలివిగా ప్రేక్షకుల ఊహకు కూడా అందకుండా కథను నడిపించాడు. ప్రథమార్థంలో కథ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో న‌డుస్తూ మంద‌గ‌మ‌నంగా అనిపిస్తుంది.  కానీ ద్వితీయార్థంలో ఊహించని మలుపులతో సాగింది. దానికి తగ్గట్టుగానే ఇంట్రర్వెల్ లో ఓ ఊహించని ట్విస్ట్ నూ ఇచ్చాడు డైరెక్టర్. హీరో నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలు, హీరోయిన్ ను సెర్చ్ చేస్తూనే హీరో రివేంజ్ తీర్చుకోవడం వంటివి కొత్తగా ఉన్నాయి. ఈ తరహా సినిమాలకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అనేది ప్రధానం. 
 
ఇక్క‌డ ప్ర‌ధానంగా చెప్పుకోద‌గింది అజయ్ అరసాడ సంగీత సార‌థ్యంలో సాగే రీరికార్డింగ్‌. త‌ను కూడా కొత్త‌వాడే. క‌థ‌నానికి జీవం పోశాడ‌నే చెప్పాలి.  పరిమితమైన బడ్జెట్ లో సాంకేతిక విలువ‌ల‌తో బాగానే న్యాయం చేశారు. 
 
హీరోగా చూసుకుంటే ‘ఆకాశమంత ప్రేమ’ షార్ట్ ఫిలిమ్ తో పాటు ‘ముద్దపప్పు ఆవకాయ్‌’, ‘పెళ్ళిగోల’ వెబ్ సీరిస్ లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష తొలిసారి ఇందులో హీరోగా నటించాడు.  శ్రుతిగా నికీషా రంగ్వాలా ఫర్వాలేదనిపిస్తుంది. జర్నలిస్ట్ గా మరో కీలకమైన పాత్రను ‘తెల్లవారితే గురువారం’ ఫేమ్ మిషా నారంగ్ పోషించింది. ఇది ఆమె చేసిన తొలి సినిమా. కానీ క‌రోనా వ‌ల్ల ఇప్పుడు రిలీజ్ అయింది. 
 
ఇక సినిమాలో కీలకమైన ఏసీపీ త్యాగి పాత్రలో రామ్ దత్ ఆకట్టుకున్నాడు. అతని లుక్ కూడా బాగుంది. హీరోయిన్ బ్రదర్ గా విష్ణు విహారి, హీరో స్నేహితుడిగా అశోక్ వర్థన్ చక్కగా నటించారు. ఇతర ప్రధాన పాత్రలను సూర్య, ‘ఛత్రపతి’ శేఖర్, వినోద్ నువ్వుల తదితరులు పోషించారు.
 
ఆక‌ట్టుకునే అంశాల‌లో - కథలోని కొత్తదనం, ఊహకందని ట్విస్టులు, సాంకేతిక నిపుణుల పనితనం క‌నిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల గంద‌ర‌గోళంగా కూడా అనిపిస్తుంది. హీరో ఒక‌సారి ఒక‌ర‌కంగా మ‌రోసారి మ‌రో ర‌కంగా క‌నిపిస్తాడు. దాన్ని ముడివిప్పే క్ర‌మంలో నిడివి ఎక్క‌వుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కోసం అస‌లు క‌థంతా చివ‌రలో పోలీసు పాత్ర‌తో చ‌క‌చ‌కా చెప్పిండ‌చంతో నిడివి ఎక్కువ‌గా అనిపిస్తుంది. కాప్ష‌న్‌లో రివెంజ్ అని పెట్టిన‌ట్లు హీరోపై అత‌ని స్నేహితులు చేసిన రివెంజ్‌, వారిపై హీరో చేసిన ప్ర‌తీకారం వ‌చ్చేలా అనిపిస్తుంది. థ్రిల్ల‌ర్ చిత్రం సీరియ‌స్ పాయింట్ క‌నుక ఎక్క‌డా కామెడీకి అవ‌కాశం లేదు. ఇలాంటి త‌ర‌హా చిత్రాల‌ను ఆద‌రించేవారికి ఇది చ‌క్క‌టి చిత్రంగా నిలుస్తుంది. అస‌భ్య‌త‌కు తావులేని ఈ సినిమా అంద‌రూ చూసేట్లుగా తీశారు.
 
రేటింగ్ : 3/5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పు తీసుకున్నారు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు: నటి స్నేహ పోలీసు స్టేషన్లో కేసు