నటీనటులు : ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్: దినేష్ పురుషోత్తమన్, సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, దర్శకుడు: రామ్ జగదీష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన తాజా తెలుగు కోర్ట్‌రూమ్ డ్రామా. ఆసక్తిని రేకెత్తించే ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చింది, విడుదల తేదీ : మార్చి 14, 2025. ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
విశాఖపట్నంలో 2013లో జరిగిన కథగా చెప్పారు. చందు ఉరఫ్ మెట్టు చంద్రశేఖర్ (హర్ష్ రోషన్) ఒక వాచ్‌మెన్ కుమారుడు. టీనేజ్ కుర్రాడు. చదువుకంటే పలు పార్ట్ టైమ్ జాబ్ లు చేస్తూంటాడు. ఇంటర్ విద్యార్థి జాబిల్లి (శ్రీదేవి ఆపల్ల) ఓసారి చందు మాటలకు ఎట్రాక్ట్ అయి అతనితో ఫోన్ లోనే ఫ్రెండ్ షిప్ చేసేస్తుంది. జాబిల్లి మామ మంగపతి (శివాజీ). ఊరిలోనే రైస్ మిల్ వ్యాపారం. రాజకీయాల్లో పలుకుబడి. కులాభిమాని మెండు. అమ్మాయిలు పద్ధతిగా వుండాలని, పరువే ఆస్తిగా భావించే మంగపతి చందు గురించి తెలిసి అరెస్టు చేయించి, అతనిపై పోక్సో చట్టాన్ని (మైనర్ పై లైంగికవేధింపుల చట్టం) ప్రయోగించి అతని జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. చందు స్నేహితులు, తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ సమయంలో ఓ లాయర్ ఇచ్చిన సలహా మేరకు విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది మోహన్ రావు (సాయి కుమార్) సహాయకుడు సూర్య తేజ (ప్రియదర్శి) సహాయం కోరతారు. మూడు రోజుల్లో ఫైనల్ తీర్పు టైంలో సూర్య తేజ కేస్ ను తీసుకున్నాడా? లేదా? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
పరువు హత్యల కథలు చాలానే వచ్చాయి. నేపథ్యాలు వేరయినా సీతాకోక చిలు, నువ్వునేను వంటి వెన్నో సినిమాలు ఇంచుమించు ఇలాంటివి. టీనేజ్ ప్రేమలు, హత్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో 2008లో ప్రభుత్వం ఫోక్సో చట్టం తీసుకువచ్చింది. దాని ప్రకారం మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తే అతనికి జీవిత ఖైదు వేస్తారు. ఈ చట్టం వుందనీ, ఇలా శిక్ష వుంటుందనీ బయట యువతకు పెద్దగా తెలీదు. పేపర్లలో ప్రకటిస్తేనో, న్యూస్ లలో చూపిస్తే సరిపోయిందనుకోవడం చాలా తప్పిదమే. ఇలాంటి ఎన్నో చట్టాలు ప్రజలకు తెలీవు. వాటిని తెలిసేలా చేయాలనే ఉద్దేశ్యమే ఈ సినిమా ఆంతర్యం.
అయితే చట్టంలో వున్న చిన్నపాటి సవరణలను తీసుకుని తెలివైన లాయర్లు, పరపతికోసం ప్రాకులాడే పెద్దలు, కులం కోసం కత్తులు నూరే బాపతు తమదాకా వస్తే ఏవిధంగా తమకు అనుగుణంగా మార్చుకుంటారనేది ఇందులో ప్రధాన పాయింట్. ఇందుకోసం పోలీసులు, లాయర్లు ఏమేరకు పెద్దలకు అమ్ముడయి నిమ్నవర్గాలను అణగదొక్కుతున్నారనేది చూపించాడు. అయితే కోర్టు డ్రామా నేపథ్యంలో సాగే సంభాషణలు, పాయింట్లు అన్నీ అందరికీ తెలిసినవే. పెద్దగా కొత్తగా చెప్పిందేమిలేకపోయినా చూస్తున్నంతసేపు ఏమి జరుగుతుందో తెలిసేలా చిత్రముంది.
టీనేజ్ లో ఆకర్షణకు ఏవిధంగా లోనవుతారనేది హీరో హీరోయిన్ల పాత్రలో దర్శకుడు చూపించాడు. కుటుంబ గౌరవం కోసం ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న కుల ఆధారిత మరియు క్రూరమైన వ్యక్తి పాత్రలో శివాజీ పాత్ర సూటయింది. కోపిష్టి, ఆవేశపరుడు, ఆలోచనా పరుడైన మంగపతి కుటుంబానికి పెద్ద అయితే కుటుంసభ్యులు ఎలా అణిగిమణిగి వుంటారనేవి మిగిలిన పాత్రల్లో చూపించారు.
లాయర్ లక్షణాలు వుండాలంటే ఎలా వుండాలనేది సాయికుమార్ పాత్ర ద్వారా అసిస్టెంట్ ప్రియదర్శిని మోటివేట్ చేసే విధానం బాగుంది. ఇది అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ పాత్ర. క్రిమినల్ లాయర్గా నటుడు హర్షవర్ధన్, ప్రియదర్శితో సమానంగా ఆకట్టుకుంటాడు. క్లైమాక్స్ లో ప్రియదర్శి జడ్జికి చెప్పిన విషయాలు ఆలోచింపజేసేలా వుంటాయి.
మైనస్ పాయింట్లు:
ఈ సినిమా ఒక ముఖ్యమైన అంశం. పోక్సో చట్టం. ఆ సమయంలో లేని ఓలా బైక్‌లు, కొన్ని సన్నివేశాలు పట్టించుకోకుండా సినిమా తీసేశాడు. టీనేజ్ ప్రేమకథ అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే కొన్ని సన్నివేశాలు పునరావృతమవుతాయి. మొదటి సగం కొంత తక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది, సెకండాఫ్ లో కొంత బాగానే అనిపిస్తుంది. సాయి కుమార్, సురభి ప్రభావతి మరియు రోషిణి మొల్లెటి వంటి కొంతమంది నటులు తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది.
సాంకేతికంగా చూస్తే, దర్శకుడు రామ్ జగదీష్ తన తొలి సినిమాలోనే ఫోక్సో అంశాన్ని తట్టిలేపాడు. ఆయన రచన, దర్శకత్వం బాగున్బానా, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దినేష్ పురుషోత్తమ్ సినిమాటోగ్రఫీ బాగుంది, విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేక భావోద్వేగ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇటువంటి సినిమాలకు మరింత సహజంగా ఉంటే బాగుంటుంది. లాయర్లు, పోలీసులు డబ్బుకు అమ్ముడయితే ఎలా వుంటుందో చక్కగా చూపించాడు. ఆ క్రమంలోనే ముగింపులో తనకు 19 సంవత్సరాలువచ్చాయంటూ.. అమ్మాయి అబ్బాయికి చెప్పి హగ్ చేసుకోవడం ప్రేమ కోసం తపించే సన్నివేశంగా చూపించాడు. బాధ్యతగల నిర్మాతలు నాని సోదరి, భార్య తీసిన ఈ సినిమా ఆలోచింపజేసే సినిమాగా చెప్పవచ్చు. ఓటీటీకి మంచి కంటెంట్ మూవీ.