మెగాహీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ గత కొంత కాలంగా సరైన హిట్‌లు లేక డీలా పడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న తేజ్‌కి చిత్రలహరి చిత్రం కాస్త ఊరటనిచ్చింది. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రాల దర్శకుడుగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్ అనే పాత్రలో సాయిధరమ్ తేజ్ మంచి నటనను కనబరిచాడు.
గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో పూర్తిభిన్నంగా సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌ను కనబరిచాడు. సంఘర్షణతో కూడుకున్న స్ఫూర్తివంతమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మరోవైపు కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. పోసాని, రావురమేష్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు తమదైన శైలిలో మెప్పించారు. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన సంగీతం బాగుంది.
మొత్తానికి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని చూసిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని తాను చాలా ఎంజాయ్ చేసానని పవన్ అన్నారు.