వ్యూస్ కోసం నన్ను చంపేశారు : హీరో సునీల్

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:57 IST)
సోషల్ మీడియాలో ఏర్పడిన పోటీ కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయని సినీ హీరో సునీల్ వ్యాఖ్యానించారు. ఇటీవల వ్యూస్ కోసం ఏకంగా తాను చనిపోయినట్టు వార్తలు రాశారని, అంటే వ్యూస్ కోసం తనను చంపాలా? అంటూ ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం సునీల్ నటించిన చిత్రం చిత్రలహరి. ఇందులో హీరో సాయి తేజ్. ఆయనతో కలిసి సునీల్ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించాడు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, 'సోషల్ మీడియా కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక వెబ్‌సైట్ వాళ్లు.. రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానని రాసేశారు. ఆ వార్త వలన వాళ్లకి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మిలియన్ వ్యూస్ కోసం నన్ను చంపేస్తారా? ఇలాంటి వార్త కారణంగా ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో తెలియాలంటే, ఇలాంటి వార్తను రాసినవారి కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్త వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ వార్తనైనా నిజానిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది' అని సలహా ఇచ్చారు. 
 
కాగా, కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్.. హీరోగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తుండంతో తిరిగి కమెడియన్‌గా స్థరపడాలని నిర్ణయించుకున్నాడు. ఫలింతంగా పలు చిత్రాల్లో కమెడియన్‌ పాత్రల్లో నటించేందుకు సమ్మతం తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మూడేళ్ల క్రితమే లూయిస్‌ను పెళ్లి చేసుకున్నాను.. మేఘనా నాయుడు