బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు బృహైన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసు జారీచేసింది. తన ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని, దాన్ని తిరిగి నివాస భవనంగా పునరుద్ధరించాలని బీఎంసీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసును గత నెల 15వ తేదీన జారీ చేయగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గతంలో సోనూసూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే విధించింది. 'మీ భవనంలోని 1 నుంచి 6వ అంతస్తులలో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ల కోసం ఆ భవనం నివాసం అవసరరాలకు ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు. పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు' అని బీఎంసీ నోటీసులో పేర్కొంది.
బీఎంసీ కార్యలయం అక్టోబరు 20వ తేదీన స్థలాన్ని పరిశీలించగా ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇంకా పనిని పునరుద్ధరించలేదని గమనించామని బీఎంసీ నోటీసు తెలిపింది. హోటల్‌ను నివాస భవనంగా మార్చాలని బీఎంసీ నోటీసులో సోనూసూద్‌ను కోరింది.