ముంబై వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 540 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 372 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అలాగే కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులు చేసింది.
ఫలితంగా భారత క్రికెట్ జట్టు ఏకంగా 372 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్, ఇతర బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ వెన్ను విరిచారు. అంతకుముందు 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ జట్టు మిగిలిన ఐదు వికెట్లను గంటలోపే చేజార్చుకోవడం గమనార్హం.