భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించింది. కానీ, అనేక మంది ఈ ఓటు హక్కును వినియోగించుకోరు. పంచాయతీ ఎన్నికలు మొదలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనేక మంది అనాసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయకపోతే రూ.350 అపరాధం విధించాలన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిపాదన కూడా భారత ఎన్నికల సంఘం చేసినట్టు ఈ వార్త సారాంశం.
అయితే, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దంటూ ఈసీ స్వయంగా గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ.. ఇలాంటి వార్తల ప్రచారం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎన్నికల్లో ఓటు వేయకుంటే రూ.350 అపరాధం విధించనుందని సాగుతున్న ప్రచారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) కూడా దర్యాప్తు చేపట్టింది.